Thursday, April 3, 2025
Homeఆంధ్రప్రదేశ్ఉపాధి హామీలో రాష్ట్ర మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేయాలి

ఉపాధి హామీలో రాష్ట్ర మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేయాలి

ఉపాధి హామీ పనులు కల్పించి వలసలు ఆపాలి
పంచాయతీరాజ్ , గ్రామీణ అభివృద్ధి శాఖ ఏ పి ముఖ్య కార్యదర్శి శశి భూషణ్ కు వినతి పత్రాన్ని అందజేసిన ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు

విశాలాంధ్ర -అనంతపురం : ఉపాధి హామీలో రాష్ట్ర మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేయాలని, ఉపాధి హామీ పనులు కల్పించి వలసలు ఆపాలని పంచాయతీరాజ్ , గ్రామీణ అభివృద్ధి శాఖ ఏ పి ముఖ్య కార్యదర్శి శశి భూషణ్ ను ఇటీవల అమరావతిలో కలిసిన ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు మాజీ ఎమ్మెల్సీ, రాష్ట్ర గౌరవ అధ్యక్షులు జల్లి విల్సన్, రాష్ట్ర అధ్యక్షులు సి. హెచ్ కోటేశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల శేఖర్, రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి ఆర్. వెంకటేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి బి. కేశవరెడ్డి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ప్రతి గ్రామంలో ఉపాధి హామీ పనులు కల్పించి వలసలు ఆపాలి. వ్యవసాయానికి అనుసంధించరాలన్నారు. మెటీరియల్ కాంపోనెంట్ను పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి. పథకంలో నిధులు పక్కదారి పట్టించరాదు అని పేర్కొన్నారు. కూలీల భద్రత కోసమే వచ్చిన ఈ పథకంలోని నిధులన్ని వారికే కేటాయించాలని, కూలీల సంఖ్య ప్రకారం నిధులు కేంద్ర ప్రభుత్వం నుండి రాబట్టాలి. రాష్ట్ర బడ్జెట్లో వాటా ఉండాలన్నారు.
కుటుంబ జాబ్ కార్డుతో నిమిత్తం లేకుండా ప్రతి వయోజనుడికి విడిగా జాబ్ కార్డు ఇవ్వాలి. పని అడిగిన వారికి 200 రోజులు పనిదినాలు కల్పించాలి. రోజు కూలి రూ. 700 ఇవ్వాలని, ప్రతి గ్రూపుకు పని కల్పించాలని, పని కల్పించకపోతే ఉపాధి భృతిగా సంవత్సరంలో ప్రతి కూలీకి రూ. 12 వేలు అందించాలన్నారు.
ఉపాధి హామీలో యంత్రాలను, కాంట్రాక్టర్లను నిషేధించాలని, వంద రోజులు పని పూర్తి చేసుకున్న ప్రతి ఉపాధి కూలీకి పథకంలో చూపెట్టిన విధంగా పనిముట్లు అందజేయాలన్నారు. పని ప్రదేశాలలో టెంట్లు, మెడికల్ కిట్లు అందుబాటులో ఉంచాలి. ఎండాకాలంలో మజ్జిగ సరఫరా చేయాల్సిన అవసరం ఉందన్నారు. రెండు పూటలా పని విధానం తీసివేయాలి. సమ్మర్ అలవెన్స్ పునరుద్ధరణ చేయాలన్నారు.
మేట్ల వ్యవస్థ తీసుకువచ్చి వారికి గుర్తింపు కార్డులు అందజేసి రోజుకు 5 రూపాయలు పారితోషికం ఇవ్వాలన్నారు. చేసిన పనికి పే స్లిప్పులు ఇవ్వాలి. పోస్ట్ ఆఫీస్ ద్వారా వారంలో బిల్లులు చెల్లించాలి. 10 వారాలుగా పెండింగ్లో ఉన్న పాత బకాయిలు తక్షణం విడుదల చేయాలన్నారు. పని ప్రదేశంలో ప్రమాదాల్లో మరణిస్తే 10 లక్షల రూపాయలు ఎక్స్రేషియా ఇవ్వాలని కోరడం జరిగిందన్నారు. వడదెబ్బపాలైతే మెరుగైన ఆరోగ్య సేవలు అందించి కోలుకునే వరకు ఉపాధి వేతనాలు అందించాల్సిన అవసరం ఉందన్నారు.
ఉపాధి హామీలో పని చేసే క్షేత్రస్థాయి సిబ్బందిపై రాజకీయ పక్షపాతాలు ఉండకూడదన్నారు.. వారికి ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. ఉపాధి హామీ పనులపై ప్రతి గ్రామంలో మైక్ ప్రచారం జరగాలి. గ్రామసభల్లో పనులు ఎంపికచేసి బహిరంగంగా వెల్లడించాలి. సామాజిక తనిఖీ పక్కాగా నిర్వహించాలని పేర్కొన్నారు. మండల స్థాయిలో వ్యవసాయ కార్మిక సంఘాలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో సమావేశం నిర్వహించాలన్నారు.
ఉపాధి హామీలో రాష్ట్ర మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేసి అందులో వ్యవసాయ కార్మిక, స్వచ్చంద సేవా సంస్థలు, పథకం అమలుకు కృషిచేస్తున్న ప్రతినిధులను చేర్చాలన్నారు. ఒరిస్సా రాష్ట్ర ప్రభుత్వం మాదిరిగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే మొత్తానికి అదనంగా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత మొత్తాన్ని కలిపి ఉపాధి కూలీకి ఇవ్వాలని వినతిపత్రంలో కోరడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు రాష్ట్ర ఉపాధ్యక్షులు చిలుకూరి వెంకటేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి కాబోతు ఈశ్వరరావు ఇతరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు