కాకినాడ జిల్లా కిర్లంపూడి పోలీస్ స్టేషన్లో పోలీసు విచారణకు వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు హాజరయ్యారు. దివంగత నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల సమయంలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలపై నమోదైన కేసులో ఆయన పోలీసుల ఎదుట విచారణను ఎదుర్కొంటున్నారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కన్నుమూసిన అనంతరం జులై 15న ఆయన స్వగ్రామం కిర్లంపూడిలో అంత్యక్రియలు జరిగాయి. ఆ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ముద్రగడ అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో (గార్డ్ ఆఫ్ ఆనర్) నిర్వహించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. అయితే, ముద్రగడ కుటుంబ సభ్యులు, వైసీపీ నేతలు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. పోలీసులు గౌరవ వందనం సమర్పించేందుకు ప్రయత్నించిన సమయంలో అంబటి రాంబాబు, ఆయన అనుచరులు అడ్డుకున్నారని, విధుల్లో ఉన్న సిబ్బందిపై తోసివేతకు పాల్పడ్డారని ఆరోపిస్తూ ఆర్మ్డ్ రిజర్వ్ ఎస్ఐ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా కిర్లంపూడి పోలీసులు జూలై 16న అంబటి రాంబాబుతో పాటు పలువురిపై కేసు నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 35 కింద గుంటూరులోని అంబటి రాంబాబు నివాసంలో పోలీసులు నోటీసులు అందించారు. ఈ వివాదంపై గతంలో స్పందించిన అంబటి రాంబాబు… తాము ముద్రగడ చివరి కోరికను అమలు చేశామని, ఆ బాధ్యత తమ పైన ఉందని చెప్పుకొచ్చారు.
కిర్లంపూడి పీఎస్ లో పోలీసు విచారణకు హాజరైన అంబటి రాంబాబు
- Advertisement -
RELATED ARTICLES


