ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై స్పందించిన సామాజిక కార్యకర్త
కేజ్రీవాల్ అధికార దాహమే ప్రస్తుత ఓటమికి కారణమని వెల్లడి
లిక్కర్ స్కాంతో ఆప్ ప్రభుత్వం, కేజ్రీవాల్ పై వ్యతిరేకత ఏర్పడిందని వ్యాఖ్య
ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే సంచలన వ్యాఖ్యలు చేశారు. తన మాజీ శిష్యుడు అరవింద్ కేజ్రీవాల్ అధికార దాహమే ఆమ్ ఆద్మీ పార్టీని ముంచేసిందని విమర్శించారు. ఆప్ ఎదుర్కొంటున్న ప్రస్తుత దారుణ పరాభవానికి ముమ్మాటికీ కేజ్రీవాల్ వైఖరే కారణమని మండిపడ్డారు. అవినీతి రహిత పాలన అందిస్తానని అధికారంలోకి వచ్చిన కేజ్రీవాల్.. అటుపై అధికార దాహంతో చేసిన పనులతో ఢిల్లీ ఓటర్లు తీవ్ర అసంతృప్తికి గురయ్యారని పేర్కొన్నారు. మూడు పర్యాయాలు ఢిల్లీ సీఎం సీటులో కూర్చున్న కేజ్రీవాల్ పై ఢిల్లీలోనే కాదు దేశవ్యాప్తంగా అవినీతి ఆరోపణలు వచ్చాయని అన్నా హజారే గుర్తుచేశారు. ఢిల్లీ లిక్కర్ పాలసీలో స్కాం ఆరోపణలు కేజ్రీవాల్ తో పాటు ఆమ్ ఆద్మీ పార్టీకి మచ్చగా మారాయని చెప్పారు. అందుకే ఢిల్లీ ఓటర్లు కేజ్రీవాల్ ను ఓడించారని అన్నా హజారే చెప్పుకొచ్చారు.
అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమించిన అన్నా హజారేకు మద్దతుగా కేజ్రీవాల్ తన ఉద్యోగాన్ని వదులుకుని మరీ వెంటనడిచారు. అన్నా హజారేకు శిష్యుడిగా అవినీతిపై పోరాడారు. ఆ తర్వాత ఉద్యమాన్ని తన చేతుల్లోకి తీసుకుని దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి తొలి ఎన్నికల్లోనే చెప్పుకోదగ్గ స్థానాలను గెల్చుకుని కాంగ్రెస్ సాయంతో సీఎం సీట్లో కూర్చున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ తీసుకున్న పలు నిర్ణయాలపై రాజకీయంగా విమర్శలు వ్యక్తం కావడం, లిక్కర్ స్కాంలో జైలుపాలవడం తదితర కారణాలు ఆప్ ను ఓడించాయని అన్నా హజారే అభిప్రాయపడ్డారు.