ప్రపంచంలోని వివిధ దేశాలకు ఉత్పత్తుల ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ దేశవ్యాప్తంగా ఏడో స్థానాన్ని దక్కించుకుంది.కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ పరిధిలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్టీఈ) విడుదల చేసిన 2025-26 గణాంకాల ప్రకారం, రాష్ట్రం నుంచి రూ.1.77 లక్షల కోట్ల విలువైన ఉత్పత్తులు విదేశాలకు ఎగుమతి అయ్యాయి.దేశ మొత్తం ఎగుమతుల్లో ఏపీ వాటా 4.57 శాతంగా నమోదైంది.దేశంలోని అన్ని రాష్ట్రాలు కలిపి 2025-26లో సుమారు రూ.39.04 లక్షల కోట్ల విలువైన ఉత్పత్తులను వివిధ దేశాలకు ఎగుమతి చేశాయి.ఈ జాబితాలో గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు తొలి మూడు స్థానాల్లో నిలవగా, ఆంధ్రప్రదేశ్ ఏడో స్థానాన్ని నిలబెట్టుకుంది. 3.18 శాతం వాటాతో తెలంగాణ ఎనిమిదో స్థానంలో ఉంది.
ఎగుమతుల విలువలో స్వల్ప పెరుగుదల
2024-25తో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ ఎగుమతుల విలువ 0.43 శాతం పెరిగింది.గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రం నుంచి రూ.1.76 లక్షల కోట్ల విలువైన ఉత్పత్తులు ఎగుమతి కాగా, 2025-26లో అది రూ.1.77 లక్షల కోట్లకు చేరుకుంది.ఇది స్థిరమైన వృద్ధికి సంకేతంగా భావిస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రం తమిళనాడు 18.59 శాతం, కర్ణాటక 17.59 శాతం వృద్ధిని నమోదు చేశాయి.మరోవైపు తెలంగాణలో ఎగుమతులు భారీగా తగ్గాయి. 2024-25లో రూ.1.62 లక్షల కోట్లుగా ఉన్న ఎగుమతులు, 2025-26లో రూ.1.23 లక్షల కోట్లకు పడిపోవడంతో 24.24 శాతం క్షీణత నమోదైంది.
ఏపీ నుంచి 841 రకాల ఉత్పత్తుల ఎగుమతి
ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రస్తుతం 841 రకాల ఉత్పత్తులు విదేశీ మార్కెట్లకు చేరుతున్నాయి.రాష్ట్ర ఎగుమతుల్లో ప్రధానంగా మెరైన్ ఉత్పత్తులు, ఫార్మాస్యూటికల్స్, పొగాకు, ఆర్గానిక్ కెమికల్స్, చేపల వేటకు ఉపయోగించే మరపడవలు, పెట్రోలియం ఆయిల్స్, బియ్యం, ఫెర్రో ఎల్లాయీస్, మిర్చి, పంచదార వంటి ఉత్పత్తులు తొలి పది స్థానాల్లో నిలిచాయి.రాష్ట్ర ఉత్పత్తులకు అత్యధిక డిమాండ్ ఉన్న దేశాల్లో అమెరికా, చైనా, సింగపూర్, బెల్జియం, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), వియత్నాం, రష్యా, మలేషియా, బ్రెజిల్, ఇండోనేషియా ఉన్నాయి.
ఎగుమతుల ప్రోత్సాహానికి ప్రభుత్వ చర్యలు
ఆంధ్రప్రదేశ్‌ను దేశంలో కీలక ఎగుమతి కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోంది.ప్రపంచ స్థాయి ఎగుమతి మౌలిక సదుపాయాల అభివృద్ధితో పాటు జాతీయ స్థాయి ఎగుమతి సంస్థలతో సమన్వయాన్ని బలోపేతం చేయాలని నిర్ణయించింది.ప్రతి జిల్లాకు ప్రత్యేక గుర్తింపు తీసుకురాగల ఉత్పత్తులను గుర్తించి క్లస్టర్ విధానంలో అభివృద్ధి చేస్తున్నారు.ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 45 కామన్ ఫెసిలిటీ సెంటర్లు (సీఎఫ్సీలు) ఏర్పాటు చేయనున్నారు.అలాగే ఎంఎస్ఎంఈలు, రైతులు, చిన్న పరిశ్రమలు తమ ఉత్పత్తులను విదేశీ మార్కెట్లలో విక్రయించేలా ప్రోత్సాహం అందించడంతో పాటు, ఎగుమతిదారుల లాజిస్టిక్ వ్యయాన్ని తగ్గించే చర్యలు చేపడుతున్నారు. ఈ-కామర్స్, డిజిటల్ మార్కెటింగ్ ద్వారా జిల్లాల ఉత్పత్తులు, సేవలకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు కల్పించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.


