.
విశాలాంధ్ర – కడియం : యుక్త వయస్సులో గర్భం ధరించడం వల్ల తల్లికి, పుట్టబోయే బిడ్డకు కూడా అనేక అనారోగ్య సమస్యలు ఏర్పడతాయని వైద్యాధికారిణి డాక్టర్ జెస్సి సుప్రియ అన్నారు. కడియం మండలం కడియపులంక గ్రామంలో సర్పంచ్ పాఠంశెట్టి వెంకట రామారావు (రాంజీ) మరియు వైద్యాధికారిణి డాక్టర్ జెస్సీ సుప్రియ ఆధ్వర్యంలో యుక్త వయస్సులో గర్భధారణ వల్ల కలిగే అనర్ధాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ జెస్సీ సుప్రియ మాట్లాడుతూ చిన్న వయస్సులో పెళ్ళి జరిగి వెంటనే గర్భం ధరించడం వలన, సరైన పోషకాహారం తీసుకోకపోవటం వల్ల ఆడపిల్లలు రక్త హీనతకు గురవుతున్నారని తెలిపారు. అలాగే గర్భసంచి లోపల శిశువు ఎదగడానికి కావలసిన అవయువాలు ఎదగకపోవటం వలన, బిడ్డ పుట్టినప్పుడు బరువు తక్కవగా ఉండటం, బిడ్డలో ఎదుగుదల లేకపోవటం వంటి అనర్ధాలు జరుగుతాయని తెలిపారు. ఇటువంటి అనర్ధాలు జరగకుండా ఉండాలంటే విద్యార్థి దశలోనే ఆడపిల్లలకు అవగాహన కల్పించాలన్నారు. గ్రామ సర్పంచ్ పాఠంశెట్టి రాంజీ మాట్లాడుతూ బాల్య వివాహాలు జరగకుండా ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సిడిపిఒ, కడియపులంక హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు, నెంబర్ వన్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, హెల్త్ సూపర్వైజర్, ఎఎన్ఎం లు, ఎడబ్ల్యు లు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.


