Homeజాతీయంఅయోధ్య విరాళాల కేసు.. నిందితుల తరఫున వాదిస్తే రూ.5 లక్షల జరిమానా

అయోధ్య విరాళాల కేసు.. నిందితుల తరఫున వాదిస్తే రూ.5 లక్షల జరిమానా

- Advertisement -

అయోధ్య రామాలయానికి భక్తులు సమర్పించిన విరాళాల దుర్వినియోగం ఆరోపణల కేసులో నిందితుల తరఫున ఏ న్యాయవాది కూడా కోర్టులో వాదించకూడదని ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఫైజాబాద్ బార్ అసోసియేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. అసోసియేషన్‌కు చెందిన ఎవరైనా న్యాయవాది నిందితుల తరఫున హాజరైతే ఆయనపై రూ.5 లక్షల జరిమానా విధిస్తామని స్పష్టం చేసింది. పవిత్రమైన అయోధ్యకు సంబంధించిన ఈ వ్యవహారంలో జరిగిన పరిణామాలు తీవ్ర ఆందోళన కలిగించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సోమవారం నిర్వహించిన ఫైజాబాద్ బార్ అసోసియేషన్ సాధారణ సమావేశంలో ఈ అంశంపై విస్తృతంగా చర్చించిన అనంతరం సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు.

ఈ వివాదంలో పేర్లు వినిపిస్తున్న చంపత్ రాయ్, అనిల్ మిశ్రా, గోపాల్ రావు ముగ్గురు మూడు రోజుల్లో అయోధ్యను విడిచి వెళ్లాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు.లేనిపక్షంలో మరింత కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న చంపత్ రాయ్ గతంలో శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు.ఆయనతో పాటు ట్రస్టీగా ఉన్న అనిల్ మిశ్రా కూడా తమ పదవులకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

ఈ మొత్తం వ్యవహారంపై స్వతంత్రంగా సీబీఐతో దర్యాప్తు చేపట్టాలని డిమాండ్
ఫైజాబాద్ బార్ అసోసియేషన్ కార్యదర్శి శైలేంద్ర జైస్వాల్ మాట్లాడుతూ, రామాలయ హుండీలో భక్తులు సమర్పించిన విరాళాల దుర్వినియోగం జరిగిందన్న ఆరోపణలు తమ మనోభావాలను తీవ్రంగా దెబ్బతీశాయని పేర్కొన్నారు. అందువల్ల ఈ కేసులో నిందితుల తరఫున ఫైజాబాద్‌కు చెందిన ఏ న్యాయవాది కూడా వాదించకూడదని అందరూ ఏకగ్రీవంగా నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు.
ఈ నిర్ణయాన్ని ఎవరైనా ఉల్లంఘించి నిందితుల తరఫున కోర్టులో వాదిస్తే వారికి రూ.5 లక్షల జరిమానా విధిస్తామని మరోసారి స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో చంపత్ రాయ్, అనిల్ మిశ్రా, గోపాల్ రావుపై కేసు నమోదు చేయాలని కోరుతూ కోర్టును ఆశ్రయించనున్నట్లు బార్ అసోసియేషన్ తెలిపింది. అలాగే ఈ మొత్తం వ్యవహారంపై స్వతంత్రంగా సీబీఐతో దర్యాప్తు చేపట్టాలని కూడా డిమాండ్ చేసింది.

పక్కదారి పట్టిన విరాళాల నిధులు
ఈ కేసులో సుమారు రూ.7 కోట్ల నుంచి రూ.7.5 కోట్ల వరకు విరాళాల నిధులు పక్కదారి పట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ అంశాన్ని సమాజ్‌వాదీ పార్టీ ప్రస్తావించడంతో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి విచారణకు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా రూ.200 కోట్ల నగదు, 200 కిలోల వెండి కనిపించడం లేదని ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ పూర్తిగా ఖండిస్తూ, వాటిలో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు