విశాలాంధ్ర – చోడవరం (అనకాపల్లి జిల్లా) : గోవాడ సుగర్స్ పరిధిలో చెరుకు సాగును ప్రోత్సహించినందుకు గాను అనకాపల్లి వ్యవసాయ పరిశోధన కేంద్రం వద్ద నిర్వహించిన కిసాన్ మేళాలో ఫ్యాక్టరీ ఫీల్డ్ మేన్ కె.వి.రామారావుకు బెస్ట్ ఎక్స్టెన్షన్ వర్కర్ అవార్డును అందజేశారు. కిసాన్ మేళాలో ప్రతీ ఏడాది అందజేసే కీ.శే. సి. వి. నరసింహారాజు మెమోరియల్ అవార్డును షుగర్ ఫ్యాక్టరీలో పనిచేయుచున్న ఫీల్డ్ మాన్ రామారావుకు బెస్ట్ ఎక్స్టెన్షన్ వర్కర్ గా అందజేశారు. ఈ అవార్డును అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ చేతులమీదుగా ప్రశంసా పత్రము, మెమొంటో మరియు శాలువాతో సత్కరించి అవార్డు ప్రధానము చేశారు. అలాగే ఫ్యాక్టరీ పరిధిలో అంబేరుపురానికి చెందిన రిటైర్డ్ ఫీల్డ్ మాన్ దాడి ముత్యాల నాయుడు, ఫ్యాక్టరీ కేన్ సెక్షన్ హెడ్ క్లర్క్ దొడ్డి శీను, గోవాడ కు చెందిన అర్జున్ మాస్టర్ కు ఉత్తమ రైతు అవార్డు అందజేశారు. కొత్త రకముల విత్తనమును అభివృద్ధి చేయుట, జంట చాళుల పద్ధతి మరియు దూరపు చాలుల పద్ధతి లో చెరకు సాగును చేయించుట, చెరకులో అంతర పంటలు వేయించుట, యాంత్రికరణలో భాగముగా చెరకు సాగులో పవర్ వీడర్లు ఉపయోగించుట, చెరకు రైతుల తోనూ, శాస్త్రవేత్తల తోను సత్సంబంధాలు కలిగియుండుట మొదలగు చెరకు అభివృద్ధి కొరకు చేసిన సేవలకు గాను ఈ యొక్క ప్రశిష్ఠాత్మకమైన అవార్డులు అందజేశారు అవార్డు గ్రహీతలు ఫీల్డ్ మేన్ రామారావు, రిటైర్డ్ ఫీల్డ్ మెన్ దొడ్డి ముత్యాల నాయుడు, దొడ్డి శ్రీను లను ఫ్యాక్టరీ ఎండి, సిబ్బంది, పలువురు చెరకు రైతులు అభినందించారు.