పశ్చిమ బెంగాల్‌లో అధికార మార్పిడి తర్వాత తృణమూల్ కాంగ్రెస్‌కు (టీఎంసీ) గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, రాష్ట్ర మాజీ మంత్రి సుజిత్ బోస్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేసింది. పురపాలక నియామకాల కుంభకోణం కేసుకు సంబంధించి కోల్‌కతాలో సోమవారం రాత్రి ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్ఏ) కింద ఈ అరెస్ట్ చేసినట్టు అధికారులు వెల్లడించారు. సౌత్ దమ్‌దమ్ మున్సిపాలిటీలో డబ్బు తీసుకుని దాదాపు 150 మందికి అక్రమంగా ఉద్యోగాలు ఇప్పించారని సుజిత్ బోస్‌పై ప్రధాన ఆరోపణలు ఉన్నాయి. ఉద్యోగాలు ఇప్పించినందుకు ప్రతిఫలంగా ఆయన ఫ్లాట్లు, భారీ నగదు డిపాజిట్లు పొందినట్టు ఆధారాలు గుర్తించామని ఈడీ ఒక ప్రకటనలో తెలిపింది. సోమవారం ఉదయం తన కుమారుడితో కలిసి విచారణకు హాజరైన సుజిత్ బోస్‌ను ఈడీ అధికారులు గంటల తరబడి ప్రశ్నించారు. విచారణకు సహకరించకపోవడం, పొంతనలేని సమాధానాలు ఇవ్వడంతో ఆయనను అరెస్ట్ చేసినట్టు పేర్కొన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ అధికారం కోల్పోయిన తర్వాత, ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి అరెస్ట్ కావడం ఇదే తొలిసారి. సుజిత్ బోస్‌ను మంగళవారం పీఎంఎల్‌ఏ ప్రత్యేక కోర్టులో హాజరుపరచి, కస్టడీ కోరనున్నారు. ఈ కేసు విచారణలో భాగంగా గతేడాది అక్టోబర్‌లో కూడా ఈడీ అధికారులు సుజిత్ బోస్ నివాసంలో సోదాలు నిర్వహించారు.


