వైసీపీ అధినేత జగన్ తమ కుటుంబ ఆస్తుల వ్యవహారంలో నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్సీఎల్టీ) లో పిటిషన్ దాఖలు చేయడం తెలిసిందే. ఈ పిటిషన్ లో ఆయన తన తల్లి విజయమ్మ, చెల్లి షర్మిలను ప్రతివాదులుగా పేర్కొనడం సంచలనం సృష్టించింది. తనకు సమాచారం అందించకుండా తల్లి, సోదరి షేర్లు బదిలీ చేసుకున్నారని జగన్ తన పిటిషన్ లో ఆరోపించారు. షేర్ల బదిలీ ఫారాలు సమర్పించకుండానే తమ పేరిట మార్చుకున్నారని వివరించారు. జగన్, వైఎస్ భారతి, క్లాసిక్ రియాలిటీ పేరిట షేర్లు కొనసాగేలా ఆదేశాలు ఇవ్వాలని తన పిటిషన్ లో కోరారు. 51.01 శాతం షేర్లు యథావిధిగా కొనసాగేలా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. తాజాగా, ఎన్సీఎల్టీ ఈ పిటిషన్ పై నేడు విచారణ చేపట్టింది. వాదనల సందర్భంగా… కౌంటర్ దాఖలు చేసేందుకు కొంత సమయం కావాలని విజయమ్మ, షర్మిల తరఫు న్యాయవాది ఎన్సీఎల్టీని కోరారు. అనంతరం, ఎన్సీఎల్టీ విచారణను డిసెంబరు 13కు వాయిదా వేసింది.
దళిత ఎమ్మెల్యేలతో సీఎం చంద్రబాబు సమావేశం …
కూటమి పార్టీ దళిత ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం సచివాలయంలో సమావేశమయ్యారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై ఎమ్మెల్యేలతో చంద్రబాబు చర్చించారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఎస్సీ వర్గీకరణ అమలుపై కీలక నిర్ణయాన్ని తెలియజేశారు. ఎస్సీ జనాభా దామాషా ప్రకారం జిల్లా యూనిట్ గా వర్గీకరణ అమలు చేయనున్నట్లు ప్రకటించారు. అధ్యయనానికి త్వరలో కమిషన్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
ఉద్యోగ నోటిఫికేషన్ల విడుదలలో జాప్యం లేకుండా నెల రోజుల్లోనే నివేదిక అందేలా చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. వర్గీకరణ అమలు ద్వారా దళితుల్లోని ఉప కులాలందరికీ సమాన అవకాశాలు కల్పించి వారికి ఊతం ఇచ్చేలా పని చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు పలు సూచనలు చేయగా, వాటిపై సీఎం సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఇటీవల సుప్రీం కోర్టు తీర్పుతో పాటు ఎన్నికల్లో హామీ కూడా ఇచ్చామని, టీడీపీయే మొదటి నుంచి దళితులకు అండగా ఉందని సీఎం అన్నారు. దళితుల అభివృద్ధికి అన్ని రకాలుగా తోడ్పాటు అందిద్దామని పేర్కొన్నారు. ఇటీవల ఎన్నికల్లో 29 ఎస్సీ శాసనసభ నియోజకవర్గాల సీట్లకు గానూ 27 స్థానాల్లో కూటమి అభ్యర్ధులను ప్రజలు గెలిపించారని, వారి నమ్మకాన్ని నిజం చేస్తామని తెలిపారు. ఒక్కసారి ఎమ్మెల్యేగా ఉంటారా.. మరింత కాలం ఎమ్మెల్యేగా ఉంటారా? అనే విషయం మీ చేతుల్లో కూడా ఉందంటూ సీఎం చలోక్తి విసిరారు. దళితుల అభివృద్ధి, సంక్షేమం అమలుపై ఎప్పటికప్పుడు చర్చించేందుకు తరచు దళిత ఎమ్మెల్యేలతో సమావేశం కావాలని ఈ సందర్భంగా సీఎం నిర్ణయించారు.
కెనడా ఎన్నికలపై ఎలాన్ మస్క్ జోస్యం..
అయినదానికీ, కానిదానికీ భారత్ తో కయ్యానికి కాలుదువ్వుతున్న కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరో ఏడాది పాటే పదవిలో ఉంటాడని టెస్లా అధినేత ఎలాన్ మస్క్ జోస్యం చెప్పారు. వచ్చే ఏడాది కెనడాలో జరగనున్న ఎన్నికల్లో ట్రూడో ఓడిపోతారని చెప్పారు. ఎక్స్ (ట్విట్టర్) లో ఓ అభిమాని చేసిన కామెంట్ కు ఆయన ఈ విధంగా జవాబిచ్చారు. ఇటీవలి అమెరికా ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తరఫున ప్రచారం చేసి మస్క్ ఆయనను గెలిపించిన సంగతి తెలిసిందే. దీనిని గుర్తుచేస్తూ.. ాట్రూడోను వదిలించుకోవడానికి మాకు మీ సాయం కావాలి్ణ అంటూ కెనడా పౌరుడు ఒకరు మస్క్ ను కోరారు. దీనికి స్పందించిన మస్క్.. వచ్చే ఎన్నికల్లో ట్రూడో ఓడిపోతాడని చెప్పారు. ప్రస్తుతం కెనడాలో ట్రూడో ప్రభుత్వం మైనారిటీలో ఉంది. వచ్చే ఏడాది అక్టోబర్ 20 లోగా అక్కడ ఎన్నికలు జరగనున్నాయి. భారత వ్యతిరేక వైఖరితో పాటు ట్రూడో సర్కారు తీసుకున్న పలు నిర్ణయాలపై ఆ దేశంలో వ్యతిరేకత ఎదురవుతోంది. ట్రూడోపై కెనడా పౌరులు ఆగ్రహంగా ఉన్నారు. అదే సమయంలో ఆయన రాజకీయ ప్రత్యర్థులు బలం పుంజుకున్నారు. వచ్చే ఎన్నికల్లో ట్రూడో ప్రాథమికంగా మూడు పార్టీలతో బలమైన పోటీ ఎదుర్కొంటారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరో రెండు చిన్న పార్టీలు కూడా కెనడా ఎన్నికల బరిలో గట్టి పోటీనిస్తాయని చెప్పారు.
పరువునష్టం కేసు గెలిచిన పళనిస్వామి..
రూ. 1.1 కోట్ల పరిహారం అందుకోనున్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి
పరువునష్టం కేసులో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి రూ. 1.1 కోట్లను పరిహారంగా అందుకోనున్నారు. 2017 కొడనాడు ఎస్టేట్ కేసుకు సంబంధించి ప్రధాన నిందితుడి సోదరుడు ధనపాల్ చేసిన ఆరోపణలపై పళనిస్వామి కోర్టును ఆశ్రయించగా, తాజాగా ఈ కేసులో తుదితీర్పు వెలువరించింది.తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు చెందిన కొడనాడు ఎస్టేట్‌లో తొలుత సెక్యూరిటీగార్డు మృతి చెందాడు. ఆ తర్వాత మరో ముగ్గురు రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారు. అనంతరం ఎస్టేట్ సీసీటీవీ కెమెరాల ఇన్‌చార్జ్ ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ కేసు ఇంకా కోర్టులో పెండింగ్‌లో ఉంది. కాగా, ఈ కేసులో ప్రధాన నిందితుడి సోదరుడు ధనపాల్.. పళనిస్వామిపై తీవ్ర ఆరోపణలు చేశాడు. ఈ ఘటనల వెనక పళనిస్వామి హస్తం ఉందని ఆరోపించారు. దీంతో పళనిస్వామి పరువునష్టం దావా వేశారు.ఈ కేసులో తాజాగా మద్రాస్ హైకోర్టు తీర్పు వెలువరించింది. ఈ సందర్భంగా జస్టిస్ ఆర్ఎంటీ టీకా రామన్ మాట్లాడుతూ.. పళనిస్వామి ప్రతిష్ఠను తగ్గించాలనే ఏకైక ఉద్దేశంతో ప్రతివాది ధనపాల్ ఈ ఆరోపణలు చేసినట్టు పేర్కొన్నారు. ధనపాల్ ఉపయోగించిన భాష పళనిస్వామిని కించపరిచేలా ఉందన్నారు. నిరాధార ఆరోపణలు చేసి పళనిస్వామి ప్రతిష్ఠను దిగజార్చినందుకు రూ. 1.1 కోట్ల పరిహారం చెల్లించాలని ఆదేశించారు.
ఏపీలో ఏడుగురు అధికారులకు ఐపీఎస్‌లుగా పదోన్నతి..
రాష్ట్ర పోలీస్ సర్వీస్‌కు చెందిన ఏడుగురు అధికారులను ఐపీఎస్‌లుగా కన్ఫర్డ్ చేస్తూ కేంద్ర హోంశాఖ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. నాన్ కేడర్ ఎస్పీలుగా ఉన్న బి.ఉమామహేశ్వరరావు, జె.రామమోహనరావు, ఎన్.శ్రీదేవిరావు, ఇ. జి. అశోక్ కుమార్, ఎ. రమాదేవిలను 2022 బ్యాచ్‌లో ఐపీఎస్‌లుగా, కేజీబీ సరిత, కె.చక్రవర్తిలను 2023 బ్యాచ్‌లో ఐపీఎస్‌లుగా కేంద్ర హోంశాఖ కన్ఫర్డ్ చేసింది. ఈ నేపథ్యంలో వీరు అందరూ గురువారం డీజీపీ ద్వారకా తిరుమలరావును కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు.
ప్రముఖ ఈవెంట్ మేనేజుమెంట్ సంస్థ నగర ప్రవేశం
విశాలాంధ్ర/హైదరాబాద్ : భారదేశంలోని ప్రముఖ ఈవెంట్ మేనేజుమేంట్ సంస్థలలో ఒకటైన “పార్టీ క్రూయిజర్స్ లిమిటెడ్” హైదరాబాద్ నగరానికి తమ కార్యకలాపాలను విస్తరించినది. హైదరాబాద్ లో పెరుగుతున్న ఈవెంట్ అవసరాలకు అనుగుణంగా తమ సేవలను అందించుటకు హైదరాబాద్ నగరానికి అధికారికంగా “పార్టీ క్రూయిజర్స్ లిమిటెడ్” విస్తరించినదాని సంస్థ ప్రతినిధులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈనాడు హైదరాబాద్ లో పెరుగుతున్న ఈవెంట్ మార్కెట్ పనితీరును గుర్తించి దానిని సద్వినియోగం చేసుకునే దిశగా ఒక వ్యూహాత్మకంగా “పార్టీ క్రూయిజర్స్ లిమిటెడ్” హైదరాబాద్ నగరంలో అవిష్కరించటమైనదన్నారు. పార్టీ క్రూయిజర్స్ లిమిటెడ్” హైదరాబాద్ కార్యాలయం వివాహాలు, సామాజిక కార్యక్రమాలు, కార్పోరేట్ ఈవెంట్స్ మరియు ఈ తరహా ఎన్నో కార్యక్రమాలకు తమ సేవలను అందించనున్నదన్నారు. హైదరాబాద్ లో “పార్టీ క్రూయిజర్స్ లిమిటెడ్” సంస్థ ఆవిష్కరణ ఒక కీలకమైన మలుపుగా వర్ణించారు. హైదరాబాద్ నగరంలో “పార్టీ క్రూయిజర్స్ లిమిటెడ్” ఆవిష్కరణ సందర్భంగా సంస్థ వ్యవస్థాపకులు జుజర్ లక్నోవాలా మరియు రచనా లక్నోవాలా మాట్లాడుతూ, హైదరాబాద్ నగరానికి తమ సేవలను తీసుకు రావటం చాల సంతోషంగా ఉంది అన్నారు. తమ సంస్థ హైదరాబాద్ లో జరిగే గొప్ప వివాహాలు మరియు భారీ ఎత్తున నిర్వహించు వేడుకలకు త్వరలోనే కేంద్ర బిందువుగా మారుతుంది అన్నారు. మేము మా ఖాతాదారులకు వినూత్న రీతిలో, చక్కని అవగాహనతో ఎలాటి ఇబ్బందులు లేకుండా ప్రతి వేడుక ఆనందమయంగా సాగెలాగా తమ ఆలోచనలు మరియు సేవలు ఉంటాయి అన్నారు. త్వరలోనే బెంగుళూరు మరియు చెన్నై వంటి ప్రధాన నగరాలకు తమ సేవలు విస్తరించనున్నట్లు చెప్పారు.