Wednesday, January 8, 2025
Home Blog Page 95

దైవ చింతనలతో గొప్ప కావ్యాలను రచించిన తత్వవేత్త భక్త కనకదాస

విశాలాంధ్ర-రాప్తాడు (అనంతపురం జిల్లా) : దైవ చింతనలతో గొప్ప కావ్యాలను రచించిన తత్వవేత్త భక్త కనకదాస అని కురుబ కుల బాంధవులు అన్నారు. భక్త కనకదాస జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నందున సోమవారం రాప్తాడులో ఆయన విగ్రహానికి కురుబలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కర్ణాటక రాష్ట్రంలో ప్రాముఖ్యత కలిగిన కవి భక్త కనకదాస కన్నడ నాట గొప్ప కవి అన్నారు. కర్ణాటక రాష్ట్రం ఉడిపి దేవాలయంలో కనకదాసకు శ్రీకష్ణుడు దర్శనభాగ్యం కల్పించినట్లు చెప్పుకుంటారన్నారు. రాష్ట్ర సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా కనకదాస జయంతి కార్యక్రమాలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. అనంతరం తహశీల్దార్ కార్యాలయం సీనియర్ అసిస్టెంట్ రామాంజినేయులు, ఆర్ఐ కరుణాకర్ కనకదాస విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలు ఇవ్వాలి

0

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : ఇంటి నిర్మాణానికి లబ్ధిదారులకు ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలంటూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం పెద్దకడబూరులోని స్థానిక సచివాలయం ఎదుట సిపిఐ, బిఎంకేయు ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి వీరేష్, బిఎంకేయు మండల కార్యదర్శి కుమ్మరి చంద్ర, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఆంజనేయ మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పేదలకు గ్రామాల్లో 1.5సెంటు, పట్టణాలలో సెంటు చొప్పున ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగిందన్నారు. ప్రభుత్వం ఇచ్చే ఒక సెంటు స్థలం పేదల నివాసానికి ఏ మాత్రం సరిపోదని భారత కమ్యూనిస్టు పార్టీ ఆనాడే వైసీపీ ప్రభుత్వానికి చెప్పినప్పటికీ ఖాతార్ చేయకుండా నాటి ప్రభుత్వం మొండిగా ముందుకు వెళ్లి ఇళ్ల పట్టాలు ఇచ్చినప్పటికీ పేదలు ఆ స్థలాల పట్ల సుముఖత చూపడం లేదన్నారు. పైగా ఇంటి నిర్మాణానికి ఇచ్చే ఆర్థిక సహాయం కూడా కేవలం 1.80 లక్షలు మాత్రమే ప్రకటించారని, ఈ సొమ్ముతో పునాదులు కూడా పూర్తి కావన్నారు. ఎన్నికల ముందు టిడిపి తాము అధికారంలోకి వస్తే గ్రామాలలో పేదలకు 3 సెంట్లు, పట్టణాలలో 2 సెంట్లు స్థలం ఇస్తామని హామీ ఇచ్చారని వెంటనే మాట నిలబెట్టుకోవాలని డిమాండ్లతో సిపిఐ, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఇంటి సమస్యలు ఉన్న లబ్ధిదారుల ద్వారా సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ వినోద్ కు వినతిపత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు తిక్కన్న, రెక్కల గిడ్డయ్య, నాగిరెడ్డి, శ్రీరాములు, మదర్ సాబ్, అర్జున్, రంగస్వామి, ఆంజనేయ తదితరులు పాల్గొన్నారు.

ఇళ్లులేని పేద ప్రజలకు ఇంటి స్థలాలు వెంటనే మంజూరు చేయాలి

సీపీఐ జిల్లా కార్యదర్శి సీ.జాఫర్ డిమాండ్
విశాలాంధ్ర- అనంతపురం : సీఎం చంద్రబాబు నాయుడు పేద ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం పట్టణంలోని పేద ప్రజలకు 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు 3 సెంట్ల స్థలం ఇవ్వాలని అనంతపురం జిల్లా సోములదొడ్డి పంచాయతీ సచివాలయంలో సీపీఐ జిల్లా కార్యదర్శి జాఫర్ లబ్ధిదారులతో ఆందోళన కార్యక్రమం నిర్వహించి పంచాయతీ సెక్టరీ హరి ప్రియ కి నివాస స్థలల అర్జీ అందచేశారు.
ఈ కార్యక్రమానికి ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి సంతోష్ కుమార్ అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా సీపీఐ జిల్లా కార్యదర్శి జాఫర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. రాష్ట్ర పార్టీ పిలుపుమేరకు రాష్ట్రవ్యాప్తంగా నిరుపేదల ఇళ్ల స్థలాల కోసం సచివాలయాల దగ్గర ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. అనంతపురం జిల్లా నివాస స్థల లబ్ధిదారులు 30 లక్షలు మంది పైగా ఉన్నారని ఎన్నికలకు ముందు ఎన్ డి ఏ కూటమిలో ఉన్న చంద్రబాబు నాయుడు మేము అధికారంలోకొస్తే పేదలకు పట్టణాలలో రెండు సెంట్లు, గ్రామాలలో మూడు సెంట్లు చొప్పున ఇళ్ల స్థలాలు, ఇంటి నిర్మాణానికి నాలుగు లక్షలు చొప్పున ఇస్తామని అధికారంలోకి వచ్చారన్నారు. గత జగన్ ప్రభుత్వం ఇంటి నిర్మాణానికి ఇచ్చే ఆర్థిక సహాయం ఏ మాత్రం సరిపోక ఇచ్చిన పట్టాలలో స్థలం ఎక్కడుందో తెలియని కారణంగా, కట్టిన ఇల్లు నిరుపయోగంగా మారాయన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్మాణానికి నాలుగు లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించడానికి స్వాగతిస్తున్నామన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో సిమెంటు, ఇసుక, ఇటుక, ఇనుము, కంకర సామాగ్రి ధరలు పెరిగిన రీత్యా ఐదు లక్షలకు పెంచి గృహ నిర్మాణానికి మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఇళ్ల స్థలాల కేటాయింపులో నిర్లక్ష్యం చేస్తే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు . ఈ కార్యక్రమంలో రూరల్ మండల కార్యదర్శి సహాయ కార్యదర్శి నరేష్ సిపిఐ జిల్లా సమితి సభ్యులు ఈశ్వరయ్య, శాంతి సంఘం కన్వీనర్ ఇమామ్, నవీక కాలనీ కార్యదర్శి రాజు, ప్రకాష్ నగర్ సుగుదేవ్, నగర్ కార్యదర్శి జిలాన్, సోమల దొడ్డి కాలనీ కార్యదర్సి నర్సింలు తదితరులు పాల్గొన్నారు

9,13వ డివిజన్ సచివాలయం వద్ద సిపిఐ ధర్నా

విశాలాంధ్ర -అనంతపురం: సిపిఐ ఆధ్వర్యంలో 9వ డివిజన్ 13వ సచివాలయం దగ్గర ధర్నా పేదలకు గ్రామాలలో 3 సెంట్లు పట్టణాల్లో 2 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఇంటి నిర్మాణాం కోసం ఐదు లక్షలు చొప్పున మంజూరు చేయవలసి కోరుతున్నాం సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శాఖ కార్యదర్శి జమీర్ భాష అధ్యక్షత నిర్వహించగా ముఖ్యఅతిథి గా ఆంధ్రప్రదేశ్ చేతి వృత్తిదారుల సమాఖ్య రాష్ట్ర కార్యనిర్వక అధ్యక్షులు సి లింగమయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేద ప్రజలు ఇళ్ల స్థలాలు లేక పక్కా ఇండ్లు లేక తీవ్ర ఇబ్బంది పడుతున్నారని కష్టజీవులకు రాష్ట్ర ప్రభుత్వం పేదలకు పట్టణంలో 2 సెంట్లు గ్రామీణ ప్రాంతాలలో 3 సెంట్లు ఇచ్చి ప్రజలను ఆదుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినక జగనన్న ఇచ్చిన ఒక సెంటు స్థలం బాత్రూం కట్టుకుంటే గాని చాలదని చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగిందన్నారు. పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి పక్కా ఇళ్ల నిర్మించాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమానికి కృష్ణదేవరాయ నగర్ సహాయ కార్యదర్శి రజియా చేతి వృత్తిదారుల సమాఖ్య జిల్లా నాయకులు బండి వెంకట రాముడు, ఆదినారాయణ, స్థానిక నాయకులు భాష తదితరులు పాల్గొన్నారు

మణిపూర్ లో మళ్లీ మంటలు..

0

ఈశాన్య రాష్ట్రం మణిపూర్ మరోసారి రగులుతోంది. కుకీలు, మైతేయీ తెగల మధ్య జరుగుతున్న గొడవల్లో ఈ నెల 7 నుంచి నేటి వరకు 19 మంది చనిపోయారు. భద్రతా బలగాల పహారాలో కొంతకాలం దాడులు ఆగినా.. తాజాగా మరోసారి హింస చెలరేగింది. రెండు తెగలకు చెందిన ప్రజలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటూ దమనకాండను కొనసాగిస్తున్నారు. ఈ నెల 7న హమర్ ట్రైబ్ కు చెందిన ఓ 31 ఏళ్ల మహిళను దుండగులు దారుణంగా అత్యాచారం చేసి చంపేశారు. ఆపై మృతదేహాన్ని లోపల ఉంచి ఇంటికి నిప్పంటించారు. చనిపోయిన మహిళ కుకీ తెగకు చెందిన టీచర్, ముగ్గురు పిల్లల తల్లి.. ఈ దారుణానికి పాల్పడింది మైతేయీ మిలిటెంట్లేనని కుకీలు ఆరోపిస్తున్నారు. ఈ దారుణం తర్వాత మైతేయీ యువకుడు ఒకరు హత్యకు గురయ్యాడు. ఆపై మరో కుకీ యువకుడిని గుర్తుతెలియని వ్యక్తులు చంపేసి నదిలో పడేశారు. ఈ క్రమంలోనే సీఆర్పీఎఫ్ బలగాల దాడిలో పది మంది కుకీ తెగకు చెందిన యువకులు చనిపోయారు. వారంతా మిలిటెంట్లేనని మైతేయీలు ఆరోపిస్తుండగా.. గ్రామ రక్షక దళమని కుకీలు చెబుతున్నారు. ఈ ఘోరం జరిగిన రోజే జిరిబామ్ గ్రామానికి చెందిన ఓ కుటుంబంలో ఆరుగురు అదృశ్యమయ్యారు. ఇందులో ముగ్గురు మహిళలతో పాటు రెండేళ్ల వయసున్న ఓ చిన్నారి కూడా ఉన్నారు.

కనిపించకుండా పోయిన ఈ ఆరుగురిలో ముగ్గురి మృతదేహాలను అడవిలో గుర్తించడంతో జిరిబామ్ లో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. ఆ తర్వాత రోజుకో మృతదేహం చొప్పున స్థానిక నదిలో కొట్టుకు వచ్చాయి. ఇది చూసి మైతేయీలు ఆగ్రహంతో రగిలిపోయారు. మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ పూర్వీకుల నివాసంతో పాటు ఎమ్మెల్యేలు, మంత్రుల నివాసాలపై దాడులు చేశారు. ఇళ్లల్లోని ఫర్నీచర్ ను బయటకు తెచ్చి నిప్పంటించారు. సీఎం బీరేన్ సింగ్ అల్లుడి ఇంటిపైనా నిరసనకారులు దాడులు చేశారు. ఆదివారం మైతేయీ సంఘాల నేతలు సమావేశమై రాష్ట్రంలో శాంతిని నెలకొల్పేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 24 గంటల్లో ఇందుకు అవసరమైన చర్యలు చేపట్టాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు.

మహిళల అత్యాచారాలపై అసెంబ్లీలో వాడివేడి చర్చ..

వైసీపీ ఎమ్మెల్సీలకు అనిత మాస్ వార్నింగ్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యాయి. ప్రశ్నోత్తరాల సమయం కొనసాగుతోంది. అయితే శాసన మండలిలో మహిళల అత్యాచారాలపై వాడివేడి చర్చ జరిగింది. ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యుల మధ్య వాగ్వాదం మొదలైంది. ఈ విషయంపై హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ.. ఏపీలో జగన్ ప్రభుత్వం కంటే ఈ ఐదు నెలల్ కూటమి ప్రభుత్వంలో క్రైమ్ రేటు చాలా తగ్గిందని మంత్రి అనిత స్పష్టం చేశారు.

ఏపీకి మరో తుపాను ముప్పు.. 23న బంగాళాఖాతంలో అల్పపీడనం

ఏపీకి మరో తుపాను ముప్పు పొంచి ఉంది. ఈ నెల 23న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఆపై పశ్చిమ వాయవ్యంగా పయనించే క్రమంలో తుపాను దిశ మారే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ నెల 26, లేదంటే 27 నాటికి శ్రీలంకకు ఉత్తర దిశగా రానుందని పేర్కొన్నారు. దీని ప్రభావం రాయలసీమ, దక్షిణ కోస్తాలోని నెల్లూరు, ప్రకాశం జిల్లాలపై పడే అవకాశం ఉందని హెచ్చరించారు. మరోవైపు, బంగాళాఖాతం నుంచి వీస్తున్న తూర్పుగాలుల ప్రభావంతో రాయలసీమ, కోస్తాలో అక్కడక్కడా వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో రాయలసీమలో పలుచోట్ల, దక్షిణ కోస్తాలో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది.

ఏపీలో భవన నిర్మాణ అనుమతులకు కొత్త విధానం: మంత్రి నారాయణ

నెల్లూరు నగర పాలక సంస్థలో వివిధ శాఖల అధికారులతో మంత్రి నారాయణ సమీక్ష
త్వరలో అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెడతామని వెల్లడి

ఏపీలో భవన నిర్మాణ అనుమతులకు సంబంధించి కొత్త విధానాన్ని త్వరలో తీసుకురానున్నట్లు మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు నగర పాలక సంస్థ కార్యాలయంలో మంత్రి నారాయణ వివిధ విభాగాల అధికారులతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ.. డిసెంబర్ 15 నాటికి భవన నిర్మాణ అనుమతులకు సంబంధించి కొత్త విధానం అమలులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి త్వరలోనే అసెంబ్లీలో బిల్లు పెడతామని పేర్కొన్నారు. 20 రాష్ట్రాల్లో అధ్యయనం చేసిన తర్వాత కొత్త విధానాలను రూపొందించామని వెల్లడించారు. అభివృద్ధికి ప్రజలు కూడా తమ వంతు సహకారం అందించాలని విజ్ఞప్తి చేసిన మంత్రి నారాయణ .. నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల అభివృద్ధి కోసం ప్రజలు తాము చెల్లించాల్సిన పన్నులను సత్వరమే కట్టాలని కోరారు. పన్నుల వసూళ్లకు గానూ రాష్ట్ర వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్‌ను సైతం నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్రంలో వాణిజ్య సంస్థల బకాయిలు చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పారు.

ఢిల్లీలో ప్రమాదకరస్థాయికి వాయు కాలుష్యం… స్టేజ్-4 ఆంక్షలు

దేశ రాజధాని ఢిలీలో క్షీణిస్తున్న గాలి నాణ్యత
నేటి నుండి మరి కొన్ని ఆంక్షలు అమలు చేయాలని నిర్ణయం

తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకూ పాఠశాలల తరగతులు ఆన్‌లైన్‌లోనే నిర్వహించాలని సీఎం ఆదేశం
దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం రోజురోజుకూ ప్రమాదకర స్థాయికి చేరుకోవడం తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. గాలి నాణ్యత క్షీణిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే పలు ఆంక్షలు విధించిన ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కమిషన్ (సీఏక్యూఎం) తాజాగా మరిన్ని కఠిన ఆంక్షలు అమలు చేయాలని నిర్ణయానికి వచ్చింది. ఢిల్లీ ఎన్‌సీఆర్ పరిధిలో గ్రేటెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (జీఆర్ఏపీ) 4 కింద మరిన్ని నిబంధనలను ఈ రోజు (సోమవారం,18వ తేదీ) నుండి అమలు చేయనున్నట్లు వెల్లడించింది. ఢిల్లీలో వాయు నాణ్యత సూచీ రాత్రి 7 గంటల సమయానికి 457కి పెరుగుతోంది. దీంతో తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకూ ఢిల్లీలోని పాఠశాలల్లో కేవలం ఆన్‌లైన్ తరగతులే నిర్వహించనున్నట్లు సీఎం అతిశీ ప్రకటించారు.

నేటి నుండి అమలు అవుతున్న నిబందనలు ఇవి
లిఢిల్లీలోకి ట్రక్కుల (నిత్యావసర వస్తువులు, సర్వీసులు అందించే ట్రక్కులు మినహా) కు ప్రవేశాన్ని నిలిపివేస్తూ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎల్ఎన్‌జీ, సీఎన్‌జీ, ఎలక్ట్రిక్, బీఎస్ 4 డీజిల్ ట్రక్కులు మాత్రమే అనుమతి. ఢిల్లీ వెలుపల రిజిస్ట్రేషన్‌తో ఉన్న తేలికపాటి కమర్షియల్ వాహనాలపై నిషేధం. అయితే ఢిల్లీ రిజిస్ట్రేషన్ ఉన్నప్పటికీ బీఎస్ ఉ 4 అంతకన్నా పాత డీజిల్ రవాణా వాహనాల ప్రవేశంపై నిషేధం.

అన్ని నిర్మాణ సంబంధిత కార్యకలాపాలను తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ ఆదేశాలు. హైవేలు, రోడ్లు, ఫ్లైఓవర్ వంతెనలు, పవర్ లైన్‌లు, పైపులైన్‌లు.. ఇలా నిర్మాణ సంబంధిత ప్రాజెక్టులను నిలిపివేస్తూ ఆదేశాలు.

ఎన్ఆర్‌సీ ప్రాంతంలో కార్యాలయాలు అన్నీ 50 శాతం సామర్థ్యంతో పని చేసేలా చూడాలని, మిగతా వారికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని సిఫార్సు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇవ్వొచ్చని సూచన.

రాష్ట్ర ప్రభుత్వ కళాశాలలను మూసివేయడంతో పాటు సరి బేసి వాహన నిబంధనలు అమలు చేయడంపై నిర్ణయం తీసుకోవాలని ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కమిషన్ సూచించింది.

ఏపీ హైకోర్టులో రామ్ గోపాల్ వర్మకు చుక్కెదురు..

అరెస్ట్ నుంచి రక్షించలేమన్న హైకోర్టు!

ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఏపీ హైకోర్టులో చుక్కెదురైంది. తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ వర్మ దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. కేసు వివరాల్లోకి వెళ్తే… గత ఎన్నికలకు ముందు ఃవ్యూహంః చిత్రాన్ని రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా చంద్రబాబు, పవన్ కల్యాణ్ లను కించపరిచేలా వర్మ సోషల్ మీడియాలో ఎన్నో పోస్టులు పెట్టారు. సినిమాలో సైతం వీరిని కించపరిచే పలు సన్నివేశాలు ఉన్నాయి. ఈ క్రమంలో వర్మపై ఉమ్మడి ప్రకాశం జిల్లా మద్దిపాడుకు చెందిన టీడీపీ నేత రామలింగం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు వర్మపై పోలీసులు కేసు నమోదు చేశారు. తమ విచారణకు హాజరుకావాలంటూ హైదరాబాద్ లో ఉన్న వర్మకు ఏపీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. నోటీసుల ప్రకారం రేపు పోలీసు విచారణకు వర్మ హాజరు కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆయన ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. అరెస్ట్ నుంచి తనకు రక్షణ కల్పించాలని, తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ హైకోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఆయన పిటిషన్ ను ఈరోజు హైకోర్టు విచారించింది. అరెస్ట్ నుంచి తాము రక్షించలేమని వర్మ న్యాయవాదికి కోర్టు స్పష్టం చేసింది. ఏదైనా ఉంటే బెయిల్ పిటిషన్ వేసుకోవాలని సూచించింది. రేపటి పోలీసు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.