విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మండల కేంద్రమైన పెద్దకడబూరులోని స్థానిక బస్టాండ్ ఆవరణంలో గురువారం సిపిఐ శత వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఆంజనేయ సిపిఐ జెండాను ఆవిష్కరించారు. అనంతరం సిపిఐ మండల కార్యదర్శి వీరేష్ మాట్లాడుతూ బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాటాలు చేసి భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్య్రం కావాలని పిలుపునిచ్చిన ఏకైక పార్టీ సిపిఐ అని కొనియాడారు. దేశంలో వందేళ్ల చరిత్ర కలిగిన పార్టీలు కాంగ్రెస్, సిపిఐ పార్టీలు అన్నారు. సిపిఐ పార్టీ పేదలకు భూమి కోసం, భుక్తి, విముక్తి కోసం అనేక పోరాటాలు చేసిందన్నారు. స్వాతంత్య్రం అనంతరం కూడా సిపిఐ కష్టజీవుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం ఉద్యమాలు చేసిన పార్టీ అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ తాలూకా అధ్యక్షులు జాఫర్ పటేల్, నాయకులు మహ్మద్ ఉసేన్, దస్తగిరి, రమేష్, రమేష్, తిక్కన్న, డోలు హనుమంతు, రంగన్న, ఆంజనేయ తదితరులు పాల్గొన్నారు.