Monday, May 19, 2025
Homeఅంతర్జాతీయంరూపం మార్చుకుని… మరింత డేంజరస్ గా దూసుకొస్తున్న కరోనా

రూపం మార్చుకుని… మరింత డేంజరస్ గా దూసుకొస్తున్న కరోనా

మళ్లీ కరోనా కేసుల పెరుగుదల..హాంగ్‌కాంగ్, సింగపూర్‌లలో తీవ్రంగా ఇన్ఫెక్షన్లు
కొత్త వేరియంట్లు, వ్యాక్సిన్ల ప్రభావం తగ్గడమే కారణమని అంచనా

ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కరోనా మహమ్మారి మరోసారి ఆందోళనకర స్థాయిలో విస్తరిస్తోంది. ముఖ్యంగా హాంగ్‌కాంగ్‌, సింగపూర్‌ వంటి ఆసియా దేశాల్లో గత కొన్ని వారాలుగా ఇన్‌ఫెక్షన్ల సంఖ్య గణనీయంగా పెరగడమే కాకుండా, ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య, మరణాలు కూడా అధికమవుతుండటం కలవరపెడుతోంది. దాదాపు ఏడాది విరామం తర్వాత కొన్ని ప్రాంతాల్లో మళ్లీ కేసులు నమోదు కావడం పరిస్థితి తీవ్రతను సూచిస్తోంది. గతంలో తీసుకున్న వ్యాక్సిన్ల ద్వారా లభించిన రోగనిరోధక శక్తి క్రమంగా తగ్గడం, కొత్త కరోనా వేరియంట్లు వేగంగా వ్యాప్తి చెందడమే ఈ ప్రస్తుత ఉద్ధృతికి ప్రధాన కారణాలుగా నిపుణులు భావిస్తున్నారు. అమెరికా అంటువ్యాధుల నిపుణుల సమాచారం ప్రకారం, ప్రస్తుతం నమోదవుతున్న కేసుల్లో 70 శాతం వరకు ఎల్‌పీ.8.1 అనే కొత్త వేరియంట్ వల్లేనని, మరో 9 శాతం కేసులకు ఎక్స్‌ఎఫ్‌సీ వేరియంట్ కారణమని తేలింది. ఆగ్నేయాసియాలోని అనేక ప్రాంతాల్లో ఈ కొత్త వేరియంట్ల వ్యాప్తి ప్రజల్లో తీవ్ర భయాందోళనలు సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో, ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే కరోనా బూస్టర్‌ డోసులు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఫ్లూ వ్యాక్సిన్‌ తరహాలోనే కోవిడ్‌ వ్యాక్సిన్‌ను కూడా పరిగణించాలని వారు చెబుతున్నారు. మరోవైపు, ఈ పెరుగుతున్న ముప్పును ఎదుర్కొనేందుకు అమెరికా ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎఫ్‌డీఏ), నోవావాక్స్‌ సంస్థ అభివృద్ధి చేసిన కొత్త వ్యాక్సిన్‌కు అత్యవసర వినియోగ అనుమతి మంజూరు చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో, మరోసారి కరోనా విలయతాండవం చేస్తుందేమోనన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు