అథ్లెటిక్స్‌లోనూ పలు పతకాలు.. క్రీడాకారులకు అభినందన0
విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : అనంతపురం స్పోర్ట్స్ ఛాంపియన్‌షిప్‌లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, వజ్రకరూరు మండలం చిన్న హోతూరు విద్యార్థులు సత్తా చాటారు. జిల్లా కలెక్టర్, డీఎస్డీవో, ఎస్జీఎఫ్, ఆర్డీటీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి క్రీడా పోటీల్లో కోకో అండర్–14 బాలుర విభాగంలో చిన్న హోతూరు జట్టు విజేతగా నిలిచి జిల్లా ఛాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకుంది.అదేవిధంగా అథ్లెటిక్స్ విభాగంలోనూ చిన్న హోతూరు విద్యార్థులు ప్రతిభ కనబరిచి పలు స్థానాలు సాధించారు. 600 మీటర్ల పరుగులో మూడో స్థానం, 200 మీటర్ల పరుగులో రెండో స్థానం, రిలే విభాగంలో రెండో స్థానం సాధించి పాఠశాలకు, గ్రామానికి, మండలానికి మంచి పేరు తీసుకొచ్చారు. విజేతలకు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అవార్డులు అందజేశారు.
ఈ సందర్భంగా పాఠశాలలో నిర్వహించిన అభినందన కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి క్రీడాకారులను అభినందించారు. క్రీడా ప్రతిభను వెలికితీయడంలో కృషి చేసిన పీడీ ప్రభాకర్‌తో పాటు పాఠశాల సిబ్బందిని అభినందించారు. విద్యార్థులు క్రీడలతో పాటు చదువులోనూ రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.జిల్లా స్థాయి పోటీల్లో చిన్న హోతూరు పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరచడం పట్ల గ్రామస్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.


