మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే రాజీనామా చేశారు. ఇవాల్టితో అసెంబ్లీ గడువు ముగియడంతో గవర్నర్ ను కలిసి రాజీనామా సమర్పించారు. షిండేతో పాటు ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ సీఎంలు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్ లు పాల్గొన్నారు. మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం కొలువుదీరే వరకు పిండే ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కొనసాగనున్నారు. ఇదిలా ఉండగా.. మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని మహాయతి కూటమి ఘన విజయం సాధించింది. మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు గాను మహాయతి కూటమి 230 స్థానాల్లో విజయం సాధించింది. తద్వారా మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది.అయితే, ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు అత్యధికంగా 132 స్థానాల్లో విజయం సాధించారు. శివసేన (షిండే) వర్గం 57 స్థానాల్లో, ఎన్సీపీ (అజిత్ పవార్) వర్గం 41 స్థానాల్లో విజయం సాధించింది. దీంతో ఈసారి ముఖ్యమంత్రి పీఠాన్ని బీజేపీకి చెందిన నేత అధిష్టించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ క్రమంలో ప్రముఖంగా ఫడణవీస్ పేరు వినిపిస్తోంది.