Homeఆంధ్రప్రదేశ్ఒకరు వద్దు.. ఇద్దరు ఓకే.. ముగ్గురు ముద్దు...

ఒకరు వద్దు.. ఇద్దరు ఓకే.. ముగ్గురు ముద్దు…

- Advertisement -

పాపులేషన్ మేనేజ్‌మెంట్ కొత్త పాలసీపై శాసనసభలో సీఎం ప్రకటన

సంతానోత్పత్తి రేటు 2.1% ఉంటే సుస్థిర ప్రగతి: చంద్రబాబు

ఏపీ శాసనసభలో పాపులేషన్ మేనేజ్‌మెంట్ పాలసీపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) కీలక ప్రకటన చేశారు. ఏపీకి అత్యంత కీలకమైన పాలసీని ఇవాళ శాసనసభలో ప్రకటిస్తున్నామన్నారు సీఎం. ఇప్పటి వరకు ఫ్యామిలీ ప్లానింగ్‌‌కు ప్రాధాన్యం ఇచ్చామని.. ఇకపై పాపులేషన్ కేర్ వైపు దృష్టి సారించాల్సి ఉందన్నారు. దీనిపై డ్రాఫ్ట్‌ పాలసీ రూపొందిస్తున్నామని, నెల రోజుల పాటు చర్చ తర్వాత తుదిరూపు ఇస్తామని చెప్పారు. పాపులేషన్‌ మేనేజ్‌మెంట్‌ పాలసీపై శాసనసభలో సీఎం ప్రకటన చేశారు. 2023 లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఏడాదికి 6.70 లక్షల మంది పిల్లలు పుడుతున్నారని అన్నారు. 2047 నాటికి రాష్ట్రంలో వృద్ధాప్యం ఎక్కువగా ఉంటుందని చెప్పారు. రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు (TFR) 1.5 శాతంగా ఉందని చెప్పారు. ఇది 2.1 శాతంగా ఉంటే సుస్థిర ప్రగతి ఉంటుందని చెప్పారు. దేశంలో కంటే రాష్ట్రంలో వృద్ధాప్యం ఎక్కువగా ఉందన్నారు.

‘‘ 1997లో ఏపీ పాపులేషన్‌ పాలసీ తీసుకొచ్చాం. మన వద్ద 1992లో టీఎఫ్‌ఆర్‌ 3 ఉండగా ఇప్పుడు 1.5కు వచ్చింది. ప్రస్తుతం తమిళనాడులో 1.4శాతం, కేరళలో 1.6శాతం, బిహార్‌లో 3 శాతం టీఎఫ్‌ఆర్‌ ఉంది. 57 శాతం మంది ఒక్కరితో ఆపివేస్తున్నారు. 32 శాతం మంది ఇద్దరిని కంటున్నారు. 9శాతం మాత్రమే ఇద్దరి కంటే ఎక్కువ మందిని కంటున్నారు. 60 ఏళ్లు దాటినవారు 10 శాతం మంది ఉన్నారు. 2047 నాటికి ఇది 23 శాతానికి చేరుతుంది.

ఏప్రిల్‌ 1 నుంచి కొత్త పాలసీ అమలు చేస్తాం. పాపులేషన్‌ మేనేజ్‌మెంట్‌ పాలసీ అమలు చేసిన మొదటి రాష్ట్రంగా ఏపీ నిలుస్తుంది. 1.5గా ఉన్న టీఎఫ్‌ఆర్‌ను 2.1కు తీసుకెళ్లడం మన లక్ష్యం. ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లల్ని కంటే కాన్పు సమయంలో రూ.25వేలు ఇస్తాం. నగదు పురస్కారం గేమ్‌ ఛేంజర్‌ కానుందని భావిస్తున్నాం. ఫ్యామిలీ ప్లానింగ్‌ ఇప్పుడు అసంబద్ధం. నా మాటల్ని గతంలో వ్యతిరేకించిన జేపీ వంటి వారు ఇప్పుడు సమర్థించారు. ఆర్‌ఎస్‌ఎస్‌ మోహన్‌ భగవత్‌ కూడా పాపులేషన్‌ పెంచాలని అంటున్నారు. యూపీ, బిహార్‌లో మాత్రమే దేశంలో అత్యధిక జనాభా ఉంది. దక్షిణ భారత దేశంలో జనాభా తక్కువగా ఉంది. జనాభా తగ్గడం వల్ల రాజకీయంగానూ ఇబ్బందులు వస్తాయి. కానీ, నేను రాజకీయ ప్రయోజనాల గురించి మాట్లాడటం లేదు.


ఇక నుంచి ఒకరు వద్దు.. ఇద్దరు ఓకే.. ముగ్గురు ముద్దు అని మాట్లాడాలి. శాసనసభలో చర్చ జరిగితే విభిన్న అభిప్రాయాలు వచ్చాయి. లేదంటే ఆ అభిప్రాయాలు ఎలా తెలుస్తాయి? ఇప్పటికీ పేద వర్గాల వారే ఎక్కువ మంది పిల్లల్ని కంటున్నారు. అందుకే తల్లికి వందనం పథకం అందరికీ ఇచ్చాం. డబ్బులు ఉన్నవారు ఎందుకు తక్కువ మంది పిల్లల్ని కంటున్నారు. అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు ఉండేలా చూస్తాం. ఒక జంటకు కనీసం ఇద్దరు పిల్లలుండాలి. ముగ్గురు పిల్లల్ని కంటే ఇంకా మంచిది. రెండో బిడ్డను కన్న తండ్రికి ఒక నెల, మూడో బిడ్డను కన్న తండ్రికి 2 నెలలు సెలవు మంజూరు చేస్తాం’’ అని చంద్రబాబు అన్నారు. త్వరలో ‘తల్లిదండ్రుల సమాన బాధ్యత’ పేరుతో కుటుంబ బాధ్యతలు పంచుకోవడంపై అవగాహన క్యాంపెయిన్ నిర్వహిస్తామని సీఎం తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు