అట్టడుగు వర్గాల హక్కుల సంరక్షకురాలిగా న్యాయవ్యవస్థ ఎదగాలి
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్
న్యూదిల్లీ: రాజ్యాంగంలో పొందుపరిచిన సూత్రాలు కేవలం మాటలు కాదని, ప్రతి పౌరుడి స్వేచ్ఛకు ఇచ్చిన హామీలు అని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. న్యాయం అందరికీ సమానంగా లభించాలని, కేవలం దావాలు వేసే స్తోమత ఉన్న సంపన్నుల హక్కుల పరిరక్షణకే కోర్టులు పరిమితం కాకూడదని తమ గొంతు వినిపించలేని వర్గాల హక్కులను పరిరక్షించే సంరక్షకురాలిగా న్యాయవ్యవస్థ ఎదగాలని ఆయన పేర్కొన్నారు. లండన్ పర్యటనలో ఉన్న సీజేఐ…క్వీన్ మేరీ యూనివర్సిటీ ఆఫ్ లండన్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ప్రజాస్వామ్యంలో న్యాయవ్యవస్థే చివరి జవాబుదారీ. అదే సమయంలో అది రాజ్యాంగానికీ జవాబుదారీగా వ్యవహరించాలి. ప్రజలకూ సేవ చేయాలి. అందుకే ఏకీకృత జాతీయ న్యాయ విధానం ఉండాలని చెబుతున్నాను. మౌలిక ప్రశ్నలపై న్యాయస్థానాలు ఒకే గొంతుకతో మాట్లాడితే…అప్ప్పుడు చట్టం చుట్టూ ప్రజలు తమ జీవితాన్ని నిర్మించుకుంటారు. తమ గొంతు వినిపించలేని, దుర్బల వర్గాల హక్కులను కాపాడే పవిత్ర బాధ్యత న్యాయవ్యవస్థది. అదే సమయంలో న్యాయవ్యవస్థ కేవలం హక్కులను పరిరక్షణకే పరిమితం కాకూడదు. నిజమైన సంరక్షకురాలిగా వ్యవహరించాలి. ఆ సంరక్షణ అందరికీ అందుబాటులో ఉండాలి. అలాకాకుండా సంపన్నులకే అందుబాటులో ఉంటే ఆ వ్యవస్థ రాజ్యాంగ బాధ్యతను నెరవేరుస్తున్నట్లు కాదు…కేవలం పనిచేస్తున్నట్లు మాత్రమే’ అని సీజేఐ పేర్కొన్నారు.
రాజ్యాంగ సూత్రాలు పౌరుడి స్వేచ్ఛకు హామీలు
- Advertisement -


