ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌కు వినతిపత్రం
విశాలాంధ్ర – అనంతపురం: ఆగస్టు 5న హంద్రీ–నీవా 36వ ప్యాకేజీ కాలువ పనుల శంకుస్థాపనకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనంతపురం జిల్లాకు రానున్న నేపథ్యంలో, అదే రోజు రాగులపాడు సబ్ కాలువ పనులకు కూడా శంకుస్థాపన చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జగదీష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం సిపిఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌కు పలు ప్రజా సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జగదీష్ మాట్లాడుతూ, గుంతకల్లు, ఉరవకొండ నియోజకవర్గాల్లోని చెరువులకు హంద్రీ–నీవా మెయిన్ కెనాల్ నుంచి రాగులపాడు వద్ద సబ్ కాలువ నిర్మించాలని 2017 ఏప్రిల్ 20న అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అనంతరం అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఈ కాలువకు పరిపాలనా అనుమతులు కూడా మంజూరు చేసిందన్నారు.
రాగులపాడు సబ్ కాలువ నిర్మాణం పూర్తయితే సుమారు 20 గ్రామాల చెరువులు నిండటంతో పాటు చెక్‌డ్యామ్‌లు, కుంటలకు నీరు చేరుతుందని తెలిపారు. భూగర్భ జలమట్టం గణనీయంగా పెరిగి సుమారు ఐదు వేల బోరుబావులు రీచార్జ్ అవుతాయని, వేలాది ఎకరాలకు సాగునీరు అందడంతో వ్యవసాయ రంగానికి కొత్త ఊపిరి లభిస్తుందని పేర్కొన్నారు.
రైతు సంఘాలు, సిపిఐ నాయకుల విజ్ఞప్తి మేరకు అప్పటి స్థానిక ఎమ్మెల్యే జితేంద్రగౌడ్ ఈ ప్రతిపాదనను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారని చెప్పారు. అనంతరం 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం కాలువ నిర్మాణానికి ఆర్థిక ఆమోదం తెలిపి టెండర్లు పిలిచి గుత్తేదారులను ఖరారు చేసినప్పటికీ, నిధులు విడుదల చేయకపోవడంతో భూసేకరణ జరగక పనులు నిలిచిపోయాయని విమర్శించారు.రాగులపాడు సబ్ కాలువ నిర్మాణం కోసం రైతు సంఘం ఆధ్వర్యంలో 2026 ఫిబ్రవరి 20 నుంచి పది రోజుల పాటు సామూహిక దీక్షలు నిర్వహించినా ప్రభుత్వం స్పందించలేదని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే నిధులు విడుదల చేసి కాలువ పనులు ప్రారంభించాలని, ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా రాగులపాడు సబ్ కాలువకు కూడా శంకుస్థాపన చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి నారాయణస్వామి, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లికార్జున, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు రామకృష్ణ, గోపాల్, అనంతపురం మండల కార్యదర్శి నరేష్, జిల్లా కౌన్సిల్ సభ్యుడు రామకృష్ణ, సిపిఐ నాయకులు ఓబులేసు తదితరులు పాల్గొన్నారు.


