Homeజిల్లాలుఅనంతపురంనేమకల్లు కొండపై చిక్కుకున్న ఎలుగుబంటి..

నేమకల్లు కొండపై చిక్కుకున్న ఎలుగుబంటి..

- Advertisement -

విశాలాంధ్ర – బొమ్మనహాళ్: బొమ్మనహాళ్ మండలం నేమకల్లు కొండల్లో ఎలుగుబంటి సంచారం స్థానికంగా కలకలం రేపింది. ఆహారం కోసం కొండపైకి వెళ్లిన ఎలుగుబంటి తిరిగి దిగేందుకు అనువైన మార్గం లేక శిఖరంపై చిక్కుకుపోయినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు వెంటనే రంగంలోకి దిగి సహాయక చర్యలు ప్రారంభించారు.

నేమకల్లు కొండల్లోని క్వారీల్లో పనిచేస్తున్న కార్మికులు ఎలుగుబంటిని గుర్తించి వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ దామోదర్ రెడ్డి, బీట్ ఆఫీసర్ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలోని సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.

ఎలుగుబంటి భయాందోళనలకు గురికాకుండా, ఎలాంటి ప్రమాదం జరగకుండా సహజ ఆవాసమైన అడవిలోకి సురక్షితంగా వెళ్లేలా ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో కొండ ప్రాంతంలోని క్వారీల్లో జరుగుతున్న కంకర తవ్వకాలను అటవీశాఖ అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. యంత్రాల శబ్దం, మానవ సంచారం వల్ల ఎలుగుబంటి మరింత భయపడే అవకాశం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.

ఎలుగుబంటికి ఎలాంటి హాని కలగకుండా సహజసిద్ధమైన మార్గంలో అడవిలోకి వెళ్లేలా అటవీశాఖ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అటవీ ప్రాంతాలకు సమీపంలో నివసించే ప్రజలు, క్వారీ కార్మికులు అప్రమత్తంగా ఉండాలని, ఎలుగుబంటి కనిపిస్తే దాని వద్దకు వెళ్లకుండా వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాలని సూచించారు.అటవీశాఖ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, ఎలుగుబంటి సురక్షితంగా అడవిలోకి చేరే వరకు తగిన చర్యలు కొనసాగిస్తామని అధికారులు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు