కాలువ వెడల్పు పనులు పూర్తి చేస్తేనే రాయలసీమకు సాగునీటి భరోసా…
జీవోలు కాగితాలకే పరిమితం… రైతులకు అందని హంద్రీ నీవా జలాలు
హంద్రీనీవా కాలువను పరిశీలించిన సిపిఐ నేతల బృందం ..
విశాలాంధ్ర–అనంతపురం,: రాయలసీమ రైతాంగానికి జీవనాడిగా భావించే హంద్రీనీవా కాలువ అభివృద్ధిపై అధికార, ప్రతిపక్ష పార్టీలు పరస్పర విమర్శలు చేసుకోవడం మానేసి, కాలువ విస్తరణ పనులు పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించడంపై దృష్టి సారించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జగదీష్ అన్నారు. ఆత్మకూరు మండల కేంద్రం సమీపంలోని హంద్రీనీవా కాలువను మంగళవారం సిపిఐ జిల్లా బృందంతో కలిసి పరిశీలించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.
టీడీపీ, వైసీపీ నాయకులు హంద్రీనీవా పేరుతో ఒకరిపై ఒకరు సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకుంటూ తమ ప్రభుత్వాల ఘనతను చాటుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కాలువ వెడల్పు చేసి 50–60 టీఎంసీల నీటిని తెచ్చామని గొప్పలు చెప్పుకోవడం కంటే, ఇప్పటికీ రైతుల పంట పొలాలకు సాగునీరు ఎందుకు చేరలేదనే ప్రశ్నకు సమాధానం చెప్పాలని నిలదీశారు.హంద్రీనీవా ప్రధాన కాలువ పూర్తయిందని చెప్పుకుంటున్నప్పటికీ, డిస్ట్రిబ్యూటరీలు, లింక్ ఛానళ్ల నిర్మాణం ఇంకా పూర్తి కాలేదని, ఈ వాస్తవాన్ని విస్మరించి అభివృద్ధి జరిగిందని చెప్పడం ప్రజలను తప్పుదోవ పట్టించడమేనన్నారు.హంద్రీనీవా ప్రాజెక్టుకు ఎన్టీఆర్ హయాంలో శంకుస్థాపన జరిగిందని, 2005లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి నిధులు కేటాయించి పనులు ప్రారంభించారని గుర్తు చేశారు. 2012లో ట్రయల్‌రన్ నిర్వహించి, 2013 నుంచి కృష్ణా జలాలు హంద్రీనీవా ద్వారా వస్తున్నప్పటికీ, ప్రాజెక్టు లక్ష్యాలు మాత్రం నేటికీ నెరవేరలేదని పేర్కొన్నారు.శ్రీశైలం జలాశయానికి వరదనీరు పరిమిత కాలం మాత్రమే వస్తుందని, ఆ సమయంలోనే గరిష్ట స్థాయిలో నీటిని తరలించాలంటే కాలువ సామర్థ్యాన్ని పెంచడం అత్యవసరమన్నారు. ఈ ఉద్దేశంతో 2017లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 6,100 క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యానికి కాలువ వెడల్పు చేయాలని జీవో జారీ చేశారని, అనంతరం 2020లో జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం 6,300 క్యూసెక్కులకు విస్తరణ చేపట్టాలని మరో జీవో తీసుకువచ్చిందని గుర్తు చేశారు. అయితే రెండు ప్రభుత్వాల జీవోలు అమలుకాక కాగితాలకే పరిమితమయ్యాయని విమర్శించారు.ప్రస్తుత కూటమి ప్రభుత్వం కూడా స్వల్పంగా మాత్రమే కాలువను విస్తరించి 3,850 క్యూసెక్కుల ప్రవాహానికి పరిమితం చేసిందని అన్నారు. గతంలో ఇచ్చిన హామీల ప్రకారం 6,100 క్యూసెక్కుల సామర్థ్యానికి ఎందుకు విస్తరించడం లేదని ప్రశ్నించారు.కాలువకు ఇరువైపులా కాంక్రీటీకరణ చేయడం వల్ల భవిష్యత్తులో మరింత వెడల్పు చేయాల్సి వస్తే మళ్లీ ఆ నిర్మాణాలను తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని, ఇది ప్రజాధనాన్ని వృథా చేయడమేనని ఆవేదన వ్యక్తం చేశారు.60 టీఎంసీల నీటిని తీసుకొచ్చామని చెప్పుకునే ప్రభుత్వాలు, రాయలసీమలో వాస్తవంగా ఎంత సాగుభూమికి నీరు అందిందో ప్రజలకు వెల్లడించాలని సవాల్ విసిరారు. రెండు దశాబ్దాలు గడిచినా డీపీఆర్‌లో పేర్కొన్న లక్ష్యాల ప్రకారం కృష్ణా జలాలను రైతులకు అందించలేకపోవడం ప్రభుత్వాల వైఫల్యమని అన్నారు. ఇప్పటికైనా అన్ని రాజకీయ పార్టీలు భేదాభిప్రాయాలను పక్కనబెట్టి హంద్రీనీవా ద్వారా రాయలసీమలో ఆరు లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఆగస్టులో నిర్వహించే సిపిఐ జీపు జాతాలో హంద్రీనీవాతో పాటు ప్రజల సమస్యలన్నింటినీ ప్రధాన అజెండాగా తీసుకుని ప్రభుత్వం మెడలు వంచేలా ఉద్యమాలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు.హంద్రీనీవా ద్వారా రైతులకు సాగునీరు అందించి స్వాతంత్ర్య సమరయోధుడు ఆదినారాయణరెడ్డి, మాజీ ముఖ్యమంత్రులు నందమూరి తారక రామారావు, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆశయాలను సాకారం చేయాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమం లో లో సిపిఐ జిల్లా కార్యదర్శి నారాయణస్వామి, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లికార్జున, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు రామకృష్ణ, గోపాల్, అనంతపురం మండల కార్యదర్శి నరేష్, ఆత్మకూరు మండల కార్యదర్శి శివ, జిల్లా కౌన్సిల్ సభ్యుడు రామకృష్ణ, సిపిఐ నాయకులు ఓబులేసు, సరస్వతమ్మ, నల్లమ్మ, కృష్ణమూర్తి, తిరుపాల్ నాయక్, గోపాల్ నాయక్, వెంకటేశ్, తులసినాయక్ తదితరులు పాల్గొన్నారు.


