Wednesday, December 25, 2024
Homeఅంతర్జాతీయంరేపిస్టులు, హంతకులకు మరణశిక్షే.. క్షమించే ప్రసక్తే లేదన్న ట్రంప్

రేపిస్టులు, హంతకులకు మరణశిక్షే.. క్షమించే ప్రసక్తే లేదన్న ట్రంప్

అత్యంత క్రూరమైన నేరస్థులకు మరణశిక్ష అమలు చేయడంలో తప్పులేదని, తాను బాధ్యతలు చేపట్టాక అలాంటి వారిని క్షమించే ప్రసక్తే లేదని అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. రేపిస్టులు, హంతకులకు మరణ శిక్ష అమలు చేయాలని ఆదేశిస్తానని చెప్పారు. సమాజంలో శాంతిభద్రతల పునరుద్ధరణ, ప్రజల రక్షణ కోసం ఈ నిర్ణయం తీసుకుంటానని, ఈమేరకు న్యాయశాఖకు ఆదేశాలు జారీ చేస్తానని ట్రూత్ సోషల్ లో ట్రంప్ పోస్ట్ చేశారు. మరణ శిక్షను ఎదుర్కొంటున్న 40 మంది ఖైదీలలో 37 మందికి బైడెన్ ఇటీవల శిక్ష తగ్గించారు. ఈ చర్యను ట్రంప్ తప్పుబట్టారు. ఫెడరల్ ఖైదీల విషయంలో కఠినంగానే ఉండాలని తేల్చిచెప్పారు. అమెరికాలోని 50 రాష్ట్రాలలో 23 రాష్ట్రాలు మరణశిక్షను రద్దు చేశాయి. మరో ఆరు రాష్ట్రాలు తాత్కాలికంగా నిలిపివేశాయి. మిగతా రాష్ట్రాల్లో మరణశిక్ష అమలవుతోంది. అయితే, తోటి ఖైదీలను హతమార్చిన వారికి, బ్యాంకు దోపిడీల సమయంలో హత్యలు చేసిన వారికి మరణ శిక్ష విధిస్తున్నాయి. అయితే, శిక్ష అమలు మాత్రం అరుదుగా జరుగుతోంది. 1988 నుంచి ఇప్పటి వరకు 79 మందికి న్యాయస్థానాలు మరణశిక్ష విధించగా.. కేవలం 16 మందికి మాత్రమే శిక్ష అమలు చేశారు. అందులోనూ ట్రంప్ తొలిసారి ప్రెసిడెంట్ అయ్యాక ఆరు నెలలలోనే 13 మందికి మరణ శిక్ష అమలు చేశారు. ప్రస్తుతం మరణ శిక్ష పడిన ఖైదీల సంఖ్య 40 ఉండగా.. వీరిలో 37 మందికి తాజాగా బైడెన్ క్షమాభిక్ష ప్రకటించి, శిక్ష తగ్గించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు