విశాలాంధ్ర – నార్పల :- మండల పరిధిలోని కేశేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) డా. ఎన్. అయూబ్ హుస్సేన్ గురువారం ఉదయం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉదయం 9:15 గంటలకు పాఠశాలకు చేరుకున్న ఆయన పాఠశాల నిర్వహణకు సంబంధించిన అన్ని రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా గత మూడు సంవత్సరాలుగా విద్యార్థుల అడ్మిషన్లు తగ్గుముఖం పట్టడంపై డీఈఓ అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే ఉపాధ్యాయులకు హెచ్ఎం జయరాంరెడ్డి సహకరించడం లేదని కొందరు ఉపాధ్యాయులు ఫిర్యాదు చేసిన విషయాన్ని ప్రస్తావించారు. పాఠశాలలో ఉన్న విద్యార్థులు దీర్ఘకాలంగా గైర్హాజరవుతున్నప్పటికీ తగిన చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు.
అదేవిధంగా ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమమైన “మిషన్ మార్చ్”ను ప్రారంభం నుంచే ఎందుకు సమర్థవంతంగా అమలు చేయలేదని హెచ్ఎంను నిలదీశారు. పాఠశాలలో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించి విద్యా ప్రమాణాలను మెరుగుపరచాలని ఆదేశించారు.
పాఠశాలలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం నార్పల ఎంఈఓ-1, ఎంఈఓ-2లు అక్కడే ఉండి చర్యలు చేపట్టాలని డీఈఓ ఆదేశించారు.
కేశేపల్లి హైస్కూల్ హెచ్ఎంపై డీఈఓ ఆగ్రహం ….
- Advertisement -


