బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం పశ్చిమ మధ్య, వాయవ్య ప్రాంతాల్లో కొనసాగుతోంది. గత ఆరు గంటల్లో ఇది గంటకు 17 కి.మీ వేగంతో ముందుకు కదిలినట్లు ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రస్తుతం ఇది ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు 220 కి.మీ, ఆంధ్రప్రదేశ్‌లోని కళింగపట్నానికి 230 కి.మీ, విశాఖపట్నానికి 320 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. రానున్న 12 గంటల్లో వాయుగుండం మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. అనంతరం బుధవారం రాత్రి లేదా గురువారం తెల్లవారుజామున విశాఖపట్నం-గోపాల్పూర్ మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.
ఈ ప్రాంతాలలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం
వాయుగుండం ప్రభావంతో మంగళ, బుధవారాల్లో శ్రీకాకుళం నుంచి బాపట్ల వరకు పలు ప్రాంతాల్లో వాతావరణం ప్రభావితమయ్యే అవకాశం ఉంది. ఆయా ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశంతో పాటు ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇక రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ అక్కడక్కడా మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. వాయుగుండం కదలికలు, వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.


