Homeతెలంగాణఆదిలాబాద్‌ రిమ్స్‌లో ఘోరం.. ఏసీ పేలి ఇద్దరు నవజాత శిశువులు మృతి!

ఆదిలాబాద్‌ రిమ్స్‌లో ఘోరం.. ఏసీ పేలి ఇద్దరు నవజాత శిశువులు మృతి!

- Advertisement -

ఆదిలాబాద్‌ రిమ్స్‌లోని నవజాత శిశువుల ప్రత్యేక సంరక్షణ విభాగం (SNCU)లో సోమవారం అర్ధరాత్రి తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా వార్డులోని ఏసీ పెద్ద శబ్దంతో పేలిపోవడంతో దట్టమైన పొగ కమ్ముకుంది. ఈ ఘటనలో ఇద్దరు నవజాత శిశువులు మృతి చెందగా.. పలువురు చిన్నారులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పరిస్థితి విషమంగా ఉన్న కొందరిని నిజామాబాద్‌కు తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు సమాచారం.

అర్ధరాత్రి వేళ ఒక్కసారిగా పేలుడు
సోమవారం అర్ధరాత్రి సమయంలో ఆదిలాబాద్‌ రిమ్స్‌లోని SNCU వార్డులో పదుల సంఖ్యలో నవజాత శిశువులు చికిత్స పొందుతున్నారు.అదే సమయంలో అకస్మాత్తుగా షార్ట్‌సర్క్యూట్‌ జరగడంతో వార్డులోని ఓ ఏసీ పెద్ద శబ్దంతో పేలిపోయింది. దీంతో క్షణాల్లోనే వార్డు మొత్తం దట్టమైన పొగతో నిండిపోయింది. పొగ కారణంగా చిన్నారులు ఊపిరి పీల్చుకోవడానికి తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. పేలుడు శబ్దం విన్న తల్లిదండ్రులు, సహాయకులు భయాందోళనకు గురై వార్డు వైపు పరుగులు తీశారు. తమ పిల్లలను ఎలాగైనా కాపాడుకోవాలనే ఆతృతతో గాజు కిటికీలను పగులగొట్టేందుకు ప్రయత్నించారు.ఒక్కసారిగా చోటుచేసుకున్న ఈ ఘటనతో ఆసుపత్రి ప్రాంగణంలో తీవ్ర గందరగోళం నెలకొంది.

ఐదు రోజుల పసికందు మృతి
ఈ ప్రమాదంలో ఇచ్చోడ మండలం శాంతినగర్‌కు చెందిన దంపతుల ఐదు రోజుల శిశువు ఊపిరాడక అక్కడికక్కడే మృతి చెందింది.పుట్టిన కొద్ది రోజులకే తమ బిడ్డను కోల్పోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. వారి రోదనలు ఆసుపత్రిలో విషాదాన్ని నింపాయి.వార్డులో ఉన్న సుమారు 27 మంది చిన్నారులకు గాయాలు, శ్వాసకోశ సమస్యలు తలెత్తినట్లు సమాచారం.పరిస్థితిని గుర్తించిన సిబ్బంది వెంటనే విద్యుత్‌ సరఫరాను నిలిపివేశారు. అనంతరం చిన్నారులను అక్కడి నుంచి ఇతర సాధారణ వార్డులకు, సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రులకు తరలించారు. తీవ్ర అస్వస్థతకు గురైన మరో ముగ్గురు శిశువుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

చికిత్స పొందుతూ మరో శిశువు మృతి
ప్రమాదంలో అస్వస్థతకు గురైన మరో శిశువును మెరుగైన చికిత్స కోసం తరలించినప్పటికీ.. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సమాచారం.దీంతో ఈ ఘటనలో మృతిచెందిన శిశువుల సంఖ్య రెండుకు చేరింది. పలువురు చిన్నారుల పరిస్థితిపై తల్లిదండ్రుల్లో ఆందోళన కొనసాగుతోంది. విషమంగా ఉన్న శిశువులను మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్‌కు తరలిస్తున్నట్లు సమాచారం.

ఘటనాస్థలికి కలెక్టర్‌, అధికారులు

ప్రమాదం గురించి సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్‌ రాజర్షి షా, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు, పోలీసు ఉన్నతాధికారులు హుటాహుటిన రిమ్స్‌కు చేరుకున్నారు. పరిస్థితిని పరిశీలించిన కలెక్టర్‌.. బాధిత చిన్నారులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఘటనకు దారితీసిన కారణాలను తెలుసుకునేందుకు పూర్తిస్థాయి విచారణకు ఆదేశించి, ఇందుకోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు.

భద్రతా లోపాలపై ప్రజల ఆగ్రహం
రిమ్స్‌ వంటి పెద్ద ప్రభుత్వ బోధనాసుపత్రిలో విద్యుత్‌ భద్రత, ఫైర్‌ సేఫ్టీ వ్యవస్థలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎలక్ట్రికల్‌ ఆడిట్‌ సక్రమంగా జరిగిందా? అగ్నిప్రమాద నివారణ వ్యవస్థలు ఎందుకు సకాలంలో స్పందించలేకపోయాయి? అనే అంశాలపై ప్రజలు, ప్రజాసంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. పేద, మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఆధారపడే ప్రభుత్వ ఆసుపత్రిలో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం బాధాకరమని స్థానికులు పేర్కొన్నారు. ఆసుపత్రిలో భద్రతా ప్రమాణాలను పూర్తిస్థాయిలో పరిశీలించాలని, ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మృతిచెందిన శిశువుల కుటుంబాలకు న్యాయం చేయడంతోపాటు, ఆసుపత్రిలో భద్రతా లోపాలను వెంటనే సరిచేయాలని కోరుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు