Homeజాతీయం'మా నిరసన ఉద్దేశం ఇదే'.. ఐఐటీ బాంబే విద్యార్థుల కీలక ప్రకటన

‘మా నిరసన ఉద్దేశం ఇదే’.. ఐఐటీ బాంబే విద్యార్థుల కీలక ప్రకటన

- Advertisement -

ఐఐటీ బాంబేలో బీటెక్ విద్యార్థి సాహిల్ రవీంద్ర వకోడే మృతి నేపథ్యంలో విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్నాయి.ఈ క్రమంలో విద్యార్థి ప్రతినిధులు తమ నిరసన ఉద్దేశంపై కీలక ప్రకటన చేశారు. అకడమిక్ మోసాన్ని సమర్థించేందుకు తాము ఆందోళన చేయడం లేదని స్పష్టం చేశారు. సాహిల్ మృతి ఐఐటీ బాంబేలోని వ్యవస్థలు, విధానాలను మరోసారి పరిశీలించాల్సిన అవసరాన్ని తమ ముందుకు తెచ్చిందని తెలిపారు.పరీక్షల్లో మోసం చేయడాన్ని లేదా ఎలాంటి అకడమిక్ తప్పిదాన్నైనా తాము సమర్థించబోమని విద్యార్థులు స్పష్టం చేశారు.అయితే ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా సంస్థలో అవసరమైన మార్పులు తీసుకురావాలన్నదే తమ ప్రధాన డిమాండ్ అని వెల్లడించారు. ఈ ఉద్దేశంతోనే నిరసన కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు.

సాహిల్ విషయంలో ఏం జరిగింది?
మహారాష్ట్రలోని యవత్మాల్ జిల్లాకు చెందిన సాహిల్ రవీంద్ర వకోడే.. ఐఐటీ బాంబేలో ఎనర్జీ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగంలో రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఇటీవల పరీక్ష హాల్లోకి సెల్‌ఫోన్ తీసుకెళ్లి, ప్రశ్నపత్రాన్ని చాట్‌జీపీటీలో అప్‌లోడ్ చేస్తుండగా పట్టుబడ్డాడని ఐఐటీ బాంబే అధికారులు తెలిపారు.అయితే ఈ ఘటనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోలేదని అధికారులు పేర్కొన్నారు.డిపార్ట్‌మెంట్ హెడ్, ఇన్‌స్ట్రక్టర్, సాహిల్‌ను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించినట్లు వివరించారు.అనంతరం శుక్రవారం రాత్రి సాహిల్ హాస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర ఆందోళనకు దారితీసింది. ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తం చేస్తూ విద్యార్థులు నిరసనలకు దిగారు.

డైరెక్టర్‌కు డిమాండ్ల పత్రం
తమ డిమాండ్లను విద్యార్థి ప్రతినిధులు పేపర్ రూపంలో ఐఐటీ బాంబే డైరెక్టర్‌కు అందజేశారు.వాటిని డైరెక్టర్ అంగీకరించి సంతకం చేశారని విద్యార్థులు తెలిపారు.నిర్ణయించిన గడువులోగా వాటిని అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు.అంతేకాకుండా డైరెక్టర్‌తో పాటు ఇతర అధికారులు పాల్గొన్న ఓపెన్ హౌస్ సమావేశం కూడా నిర్వహించినట్లు చెప్పారు.ఈ సందర్భంగా విద్యార్థులు తమ సమస్యలు, సందేహాలను అధికారుల ముందే నేరుగా ప్రస్తావించారు.వాటికి డైరెక్టర్ సమాధానాలు ఇచ్చారని తెలిపారు. విద్యార్థులతో చర్చించేందుకు అధికారులు ముందుకు వచ్చిన తీరును తాము స్వాగతిస్తున్నామని విద్యార్థి ప్రతినిధులు పేర్కొన్నారు.

దూల్లా విషయంలో విద్యార్థుల క్లారిటీ
ప్రొఫెసర్ సూర్యనారాయణ దూల్లా వ్యవహారంపై కూడా విద్యార్థులు తమ వైఖరిని స్పష్టం చేశారు.దూల్లా తప్పు చేశారని తాము ముందుగానే నిర్ణయానికి రాలేదని తెలిపారు.ఆయనపై కొనసాగుతున్న విచారణ నిష్పక్షపాతంగా జరగాలని కోరుకుంటున్నామని చెప్పారు.విచారణ పూర్తయ్యే వరకు దూల్లాను డీన్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ అఫైర్స్ బాధ్యతల నుంచి తప్పించాలన్నదే తమ డిమాండ్ అని విద్యార్థులు వివరించారు.ఈచర్యను దూల్లాను దోషిగా తేల్చేందుకు కోరడం లేదని స్పష్టం చేశారు.విచారణ స్వతంత్రంగా,ఎలాంటి ప్రభావం లేకుండా కొనసాగేందుకు ముందుజాగ్రత్త చర్యగా మాత్రమే ఈడిమాండ్ చేస్తున్నామని పేర్కొన్నారు.ఇదేసమయంలో ఐఐటీ బాంబే పీఆర్వో కూడా దూల్లాను డీన్ పదవి నుంచి మాత్రమే సస్పెండ్ చేసినట్లు స్పష్టంచేశారు.ఆయనను ప్రొఫెసర్ పదవి నుంచి పూర్తిగా సస్పెండ్ చేయలేదని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు