విశాలాంధ్ర ధర్మవరం; ధర్మవరం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి, ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్ ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. నియోజకవర్గంలో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంతో పాటు మున్సిపల్ పారిశుధ్యం, ప్రభుత్వ వైద్య సేవలు, పోలీస్ శాఖ, దివ్యాంగుల సంక్షేమం వంటి కీలక రంగాల అభివృద్ధికి అవసరమైన సహకారాన్ని సమీకరిస్తున్నారు. ప్రభుత్వ నిధులతో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలకు అదనంగా కార్పొరేట్ సంస్థల సామాజిక బాధ్యత నిధులు, సహకారాన్ని కూడా ప్రజల అవసరాలకు ఉపయోగపడేలా తీసుకురావడంపై మంత్రి దృష్టి సారిస్తున్నారు.ఈ క్రమంలో హెచ్పీసీఎల్, ఎస్ఈఐఎల్, ఈగిల్ కోట్స్, గ్లాండ్ ఫార్మా వంటి సంస్థలు సుమారు రూ.2.025 కోట్లు అందించనున్నాయి. డాక్టర్ రెడ్డీస్ సంస్థ ద్వారా మరో తొమ్మిది ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఆధునికీకరణకు సహకారం ప్రతిపాదించబడింది. ఈ సంస్థల సహకారాన్ని సమర్థంగా వినియోగించుకుని ధర్మవరం పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన సదుపాయాలు కల్పించే దిశగా చర్యలు కొనసాగునున్నాయి.
ధర్మవరం పట్టణంలో పారిశుధ్య నిర్వహణను మరింత మెరుగుపరచడం, ప్రజలకు అవసరమైన మున్సిపల్ సేవలను బలోపేతం చేయడంపై మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు. ఇందులో భాగంగా ఎస్ఈఐఎల్ సంస్థ సహకారంతో మున్సిపాలిటీకి చెత్త సేకరణ కోసం 16 ఎలక్ట్రిక్ వాహనాలు, రెండు వాటర్ ట్యాంకర్లు అందించనున్నారు. ఈ వాహనాలు పట్టణంలో పారిశుధ్య నిర్వహణకు, అవసరమైన ప్రాంతాల్లో నీటి సరఫరాకు ఉపయోగపడనున్నాయి. అలాగే ఈగిల్ కోట్స్ సంస్థ మున్సిపాలిటీ పరిధిలోని భవనాల అభివృద్ధి, మరమ్మతులకు ఉపయోగపడే పెయింట్ను సరఫరా చేసింది. ఈ సహకారంతో సంబంధిత భవనాల నిర్వహణ, రూపురేఖల మెరుగుదలకు అవకాశం కలుగుతుంది.
పట్టణాభివృద్ధి అంటే కేవలం రహదారులు, భవనాల నిర్మాణమే కాకుండా ప్రజలకు నిత్యం అవసరమయ్యే పారిశుధ్యం, నీటి సరఫరా, ప్రభుత్వ భవనాల నిర్వహణ వంటి సేవలు కూడా మెరుగుపడాలని మంత్రి భావిస్తున్నారు.
అదేవిధంగా డాక్టర్ రెడ్డీస్ సంస్థ సహకారంతో తొమ్మిది ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఆధునికీకరణ, మౌలిక సదుపాయాల అభివృద్ధికి చర్యలు ప్రతిపాదించారు. ఇందులో భాగంగా ధర్మవరం నియోజకవర్గం పరిధిలోని వైద్య కేంద్రాల్లో అవసరమైన సదుపాయాలను మెరుగుపరచడం ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవకాశం కలుగుతుంది. ధర్మవరం డివిజన్లోని బత్తలపల్లి, మోళకవేముల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, శివానగర్, కొత్తపేట, దుర్గానగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, దర్శినమల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఆధునికీకరణ ఈ కేంద్రాల్లో వైద్య, రోగ నిర్ధారణ, ఇమ్యునైజేషన్ పరికరాలను సమకూర్చడంతో పాటు మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం జరుగుతుంది. సంబంధిత ప్రాంతాల ప్రజలకు వైద్య సేవలు మరింత మెరుగుపడనున్నాయి.
అభివృద్ధే అజెండా.. ప్రజా సంక్షేమమే లక్ష్యం..
- Advertisement -
RELATED ARTICLES


