ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఇవాళ(శనివారం) అయిదో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. శాసన మండలికి ఇవాళ సెలవు ప్రకటించారు. ఉదయం శాసనసభ ప్రారంభం కాగానే సంతాప తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ 2024 -25 పై డిమాండ్స్, గ్రాంట్స్ పై పలు శాఖల మంత్రులు వివరణ ఇవ్వనున్నారు. ఆర్ అండ్. బీ..ఇండస్ట్రీస్, జల వనరులు, వ్యవసాయం, సివిల్ సప్లై, హౌసింగ్ శాఖల గ్రాంట్స్‌లపై ఆయా శాఖల మంత్రుల వివరణ ఇవ్వనున్నారు. పీఎంఏవై ద్వారా రాష్ట్రంలో ఏపీ టిడ్కో అధ్వర్యంలో నిర్మించిన ఇళ్లపై సభలో సల్ప కాలిక చర్చ జరగనుంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పూర్తిస్ధాయి బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి పయ్యవుల కేశవ్ ప్రవేశపెట్టారు. 2024-25 ఆర్ధిక సంవత్సారాల ఏపీ వార్షిక బడ్జెట్‌ను సభముందు ఉంచుతున్నానని.. రాష్ట్రాన్ని కాపాడాలని అపూర్వమైన తీర్పును ఇచ్చిన ప్రజల సంకల్పానికి ఈ బడ్జెట్ ప్రతిబింబమని తెలిపారు. రాష్ట్రంలోని వ్యవస్ధలను నిర్వీర్యం చేసి రాష్ట్రానికి జగన్ ప్రభుత్వం చేసిన ద్రోహన్ని ఏడు శ్వేతపత్రాల ద్వారా తెలియజేశామని అన్నారు. కేంద్ర పథకాల నిధుల మల్లింపు.. పిల్లల పౌష్టికాహరాన్ని అందించే పథకాల నిధులు కూడా మళ్లించారని, ఇందన రంగ నిధులు మళ్లింపు… ఇలాంటి పరిస్ధితుల వల్ల ఆర్ధిక గందరగోళ పరిస్ధితులు ఎదురయ్యాయని.. నేడు రాష్ట్ర ఆర్ధిక వ్యవస్ధ పతనం అంచున ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మాటలను మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రసంగంలో ప్రస్తావించారు. 57 శాతం ఓట్లతో 175 సీట్లకు గానూ 93 శాతం సీట్లు గెలిచామని గుర్తుచేశారు. వైసీపీ దుర్మార్గపు పాలనకు వ్యతిరేకంగా ప్రజలు ఇచ్చిన విప్లవ సమాధానం ఈ ఫలితమని పయ్యవుల కేశవ్ తెలిపారు.
మరోవైపు ఈ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలకు తాము హాజరు కాబోమని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ఇప్పటికే స్పష్టం చేశారు. తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వనందు వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. అయితే కూటమి ప్రభుత్వంపై తాము విమర్శలు చేస్తామని తెలిపారు. అది కూడా తన నివాసంలోని మీడియా పాయింట్ నుంచే ఈ విమర్శలు చేస్తామని మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు.
అదీకాక తమకు ప్రతిపక్ష హోదా కేటాయిస్తే.. అసెంబ్లీలో మైక్ అధిక సమయం కేటాయించాల్సి వస్తుందని కూటమి ప్రభుత్వం భావనలా ఉందని పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాలకు కూటమి ప్రభుత్వంలోని భాగస్వామ్య పక్షాలైన బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీల ఎమ్మెల్యేలు మాత్రమే హాజరుకానున్నారు.