ఆ దేశ నరమేధ చర్యలను ఎండగట్టిన భారత్
జనీవా: గురువింద గింజ సామెతాలా ఉంది ఐక్యరాజ్యసమతి భద్రతా మండలిలో పాక్ ప్రతినిధి వ్యాఖ్యలు. ఈ వ్యాఖ్యలతో అంతర్జాతీయ వేదికపై పాకిస్థాన్‌కు మళ్లీ భంగపాటు తప్పలేదు. ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో భారత్‌పై నిందలు మోపేందుకు పాక్ ప్రయత్నించింది. అయితే, భారత్ వీటిని గట్టిగా తిప్పికొట్టింది. అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవడంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. సాయుధ ఘర్షణల్లో పౌరులకు రక్షణ కల్పించే అంశంపై ఐరాసలో బహిరంగ చర్చ జరిగింది. ఈ సందర్భంగా పాక్ ప్రతినిధి జమ్మూకశ్మీర్ అంశాన్ని ప్రస్తావించారు. దీన్ని ఐరాసలోని భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ గట్టిగా తిప్పికొట్టారు. నరమేధ చర్యలకు పాల్పడే దేశం… భారత అంతర్గత విషయాల గురించి ప్రస్తావించడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. ఈ ఏడాది ఆరంభంలో అఫ్గానిస్థాన్ పై పాక్ జరిపిన దాడుల గురించి హరీష్ ప్రస్తావించారు. పవిత్ర రంజాన్ మాసంలో కాబుల్‌లోని ఓ ఆస్పత్రిపై జరిగిన దాడిని ప్రపంచం ఇంకా మరిచిపోలేదన్నారు. ఈ అమానుషమైన హింసాకాండలో 269 మంది ప్రాణాలు కోల్పోగా… మరో 122 మంది గాయపడినట్లు తెలిపారు. ‘చీకట్లో అమాయక పౌరులను లక్ష్యంగా చేసుకుంటూ అంతర్జాతీయ చట్టాల గురించి మాట్లాడటం పాక్ కపటత్వానికి నిదర్శనం’ అని విమర్శించారు. తన సొంత ప్రజల పైనే బాంబులు వేస్తూ, జాతి నిర్మూలనకు పాల్పడే దేశం ఇలాంటి దురాక్రమణ చర్యలకు పాల్పడటంలో పెద్ద ఆశ్చర్యం కలిగించే విషయం కాదన్నారు. ఉగ్రవాదులను పెంచి పోషిస్తూ ప్రపంచ దేశాలపై ఉసుగొల్పుతోన్న పాక్‌కు చర్యలు విశ్వవినుతమే.
ఐరాసలో పాక్‌కు భంగపాటు
- Advertisement -
RELATED ARTICLES


