విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : ఉరవకొండ మండలం పెన్నహోబిలం లోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులు సమర్పించిన హుండీ కానుకలను బుధవారం లెక్కించారు. బ్రహ్మోత్సవాల ప్రత్యేక అధికారి, జిల్లా దేవాదాయ శాఖ అధికారి గంజి మల్లికార్జున ప్రసాద్ పర్యవేక్షణలో ఆలయ చైర్మన్ రేగటి నాగరాజు ఆధ్వర్యంలో హుండీలను తెరిచి లెక్కింపు చేపట్టినట్లు ఆలయ కార్యనిర్వాహణాధికారి సాకే రమేష్ బాబు తెలిపారు. ఈ లెక్కింపులో ప్రధాన హుండీ ద్వారా రూ. 25,96,507 ఆదాయం లభించగా, అన్నదానం హుండీ ద్వారా రూ. 1,109 వచ్చింది. మొత్తంగా రెండు హుండీల ద్వారా రూ. 25,97,616 ఆదాయం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. గత సంవత్సరం ఇదే బ్రహ్మోత్సవాల సమయంలో రూ. 15,85,888 మాత్రమే రావడంతో, ఈ ఏడాది రూ. 10,11,728 అధికంగా వచ్చినట్లు తెలిపారు. భక్తుల సంఖ్య పెరగడం, స్వామివారి పై విశ్వాసం మరింత పెరగడం వల్లే ఆదాయం గణనీయంగా పెరిగిందని ఆలయ ఈవో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు సభ్యులు మీనుగ రామకృష్ణ, చంద్రమౌళి స్వామి, మంగళ నారాయణప్ప, ధనుంజయ ఆచారి, గుంతకల్లు హనుమాన్ సేవా సంస్థ సభ్యులు, భవాని సేవా సమితి అనంతపురం ప్రతినిధులు, టీడీపీ నాయకులు మోపిడి గోవిందు, ఇంద్రావతి సుధాకర్, బొల్లినేని ఓబులేసు, కురుబ ఎర్రిస్వామి, డబ్బర మురళి, ఉరవకొండ పోలీస్ సిబ్బంది, కెనరా బ్యాంకు ఉరవకొండ సిబ్బంది పాల్గొన్నారు.


