– కమిటీ సమావేశంలో పాల్గొన్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు
అభివృద్ధి పనులకు వేగం పెంచాలని సూచనలు
విశాఖపట్నం- జనవరి 09: విశాఖపట్నం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా రివ్యూ కమిటీ సమావేశంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పాల్గొని జిల్లా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుపై విస్తృతంగా మాట్లాడారు. ఈ సమావేశంలో విశాఖపట్నం జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి, విశాఖ ఎంపీ శ్రీభరత్, నగర శాసనసభ్యులు, ఐఏఎస్ అధికారులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రభుత్వం సంక్షేమం–అభివృద్ధి రెండింటినీ సమతుల్యంగా ముందుకు తీసుకెళ్తోందని అన్నారు. జిల్లా అభివృద్ధిలో శాఖల మధ్య సమన్వయం అత్యంత కీలకమని, ప్రజల సమస్యలకు వెంటనే స్పందించే పాలన ఉండాలని స్పష్టం చేశారు.జిల్లాలో మెడికల్ అండ్ హెల్త్ విభాగం పరిధిలో నాన్-కమ్యూనికబుల్ వ్యాధులు, మాతృ మరణాల రేటు, శిశు మరణాల రేటు, వెక్టర్ బోర్న్ వ్యాధుల నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పల్లా సూచించారు. ప్రజారోగ్యంపై ఎలాంటి నిర్లక్ష్యం సహించబోమని, నివారణ చర్యలను మరింత పటిష్టం చేయాలని అధికారులను సూచించారు.
రెవెన్యూ విభాగంలో జీఓ నెం.30 (అనాబ్జెక్షనబుల్), జీఓ నెం.45 (గాజువాక), జీఓ నెం.27 (యూఎల్సీ) కింద భూ క్రమబద్ధీకరణ అంశాలను వేగవంతంగా పరిష్కరించాలని, రీసర్వే ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేయాలని పల్లా స్పష్టం చేశారు. ప్రజలను కార్యాలయాల చుట్టూ తిప్పకుండా సమస్యలకు తక్షణ పరిష్కారం ఇవ్వాలని సూచించారు. వీఎంఆర్‌డీఏ పరిధిలో మాస్టర్ ప్లాన్ రోడ్లు, కొత్త ప్రాజెక్టుల అమలుపై సమీక్ష నిర్వహించి, నగర విస్తరణకు అనుగుణంగా ప్రణాళికాబద్ధ అభివృద్ధి జరగాలన్నారు. అదే విధంగా జీవీఎంసీ పరిధిలో నీటి సరఫరా, అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్ నిర్వహణ, శానిటేషన్, వీధి దీపాలు, ఏపీటిడికో పనుల పురోగతిని సమీక్షిస్తూ ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా పర్యవేక్షణ పెంచాలని అధికారులను దిశానిర్దేశం చేశారు.
హౌసింగ్ విభాగంలో పీఎంఏవై గృహాల నిర్మాణం వేగవంతం కావాలని, అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇల్లు అందేలా చర్యలు తీసుకోవాలని పల్లా సూచించారు. అలాగే మహిళా–శిశు సంక్షేమం, దివ్యాంగుల సంక్షేమం, సామాజిక సంక్షేమం, బీసీ, గిరిజన, మైనారిటీ సంక్షేమ శాఖల పథకాలు లబ్ధిదారులకు పూర్తిస్థాయిలో అందేలా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ పెంచాలని అన్నారు.
పాఠశాల విద్య, సివిల్ సప్లయిస్, డీఆర్‌డీఏ ద్వారా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు, డీడబ్ల్యూఎంఏ పరిధిలో ఉపాధి హామీ పథకం, పీఎంకేఎస్‌వై, గ్రామీణ తాగునీటి సరఫరా వంటి అంశాల్లో ఎలాంటి జాప్యం జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను దిశానిర్దేశం చేశారు. జిల్లా రివ్యూ కమిటీ సమావేశం ద్వారా జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి పనులకు మరింత వేగం తెచ్చేలా స్పష్టమైన కార్యాచరణ దిశానిర్దేశం ఇవ్వబడిందని, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రతి శాఖ బాధ్యతాయుతంగా పనిచేయాలనే స్పష్టమైన సూచనలు అందించామని పల్లా శ్రీనివాసరావు తెలిపారు.


