–అమెరికాకు తేల్చి చెప్పిన యూకే
లండన్: అణు ఒప్పందంపై చర్చలు ఓ కొలిక్కి రాకపోవడంతో ఇరాన్‌పై దాడులకు అమెరికా సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఇరాన్‌పై దాడులకు తమ దేశంలోని రెండు కీలక స్థావరాలను వాడొద్దని యూకే అగ్రరాజ్యానికి తేల్చి చెప్పింది. దీంతో స్విండన్ సమీపంలోని ఫెయిర్ ఫోర్డ్ బేస్ నుంచి లాంగ్‌రేంజ్ బాంబింగ్ ఆపరేషన్లు నిర్వహించడానికి అగ్రరాజ్యానికి అవకాశం లేకుండా పోయింది. మరోవైపు ఇప్పటికే డియాగో గార్సియా బేస్‌ను మారిషస్‌కు తిరిగి అప్పజెప్పాలన్న యూకే నిర్ణయంపై ట్రంప్ అసంతృప్తి వ్యక్తంచేసిన నేపథ్యంలో తాజాగా ఆ దేశ ప్రభుత్వం అమెరికాపై ఈ నిషేధం విధించడం గమనార్హం. ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని ఆపాలని కొంతకాలంగా అమెరికా ఆ దేశంపై ఒత్తిడి తీసుకువస్తోంది. ఈ విషయంలో జరుగుతున్న చర్చలు విఫలమైతే దాడులు చేస్తామని బెదిరించింది. ఇందుకోసం అనేక యుద్ధ నౌకలు, విమానాలు, సైనిక దళాలను ఇరాన్ వైపు తరలిస్తోంది. ఏ క్షణంలో అయినా ఇరాన్‌పై అగ్రరాజ్యం విరుచుకుపడే అవకాశం ఉందని యూఎస్ అధికారిక వర్గాలు వెల్లడించాయి. తాజాగా ఇరాన్‌తో చర్చల గురించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుతూ.. మరో 10 రోజుల్లో అణు ఒప్పందంపై తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. ఒకవేళ ఒప్పందం కుదరకపోతే యూకే విదేశీ భూభాగమైన డియాగో గార్సియా, ఫెయిర్ ఫోర్డ్ బేస్‌ల మీదుగా టెహ్రాన్‌పై దాడులు చేస్తామన్నారు. మధ్యప్రాచ్య ప్రాంతంలో దాడులు చేయడానికి అమెరికా (USA) గతంలో ఫెయిర్ ఫోర్డ్ బేస్‌ను, హిందూ మహాసముద్రంలోని యూకే విదేశీ భూభాగమైన డియాగో గార్సియాను ఉపయోగించింది. ఈ నేపథ్యంలోనే మరోసారి ఆ దేశంపై ఆయా స్థావరాల నుంచి దాడులు చేయడానికి యూకేను అనుమతి కోరింది. ఈ క్రమంలోనే తమ బేస్‌లను ఉపయోగించవద్దని కీర్ స్టార్మర్ ప్రభుత్వం తేల్చిచెప్పింది.


