. ఆహ్లాదకరంగా రహదారులు, కూడళ్లు, గ్రీన్‌బెల్ట్, బఫర్ జోన్లు
. వృక్షజాతులు, ఔషధ మొక్కలకు ప్రాధాన్యం
. సింగపూర్ బిడదారి హౌసింగ్ ప్రాజెక్టు తరహాలో గృహనిర్మాణం
. బ్యూటిఫికేషన్, గ్రీన్-బ్లూ మాస్టర్‌ప్లాన్‌పై చంద్రబాబు సమీక్ష
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : ప్రకృతి అందాలతో రాజధాని అమరావతి నగరాన్ని తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతి ఇన్‌నేచర్ అనే కాన్సెప్టుతో హరిత ప్రణాళికలు అమలు చేయాలని సూచించారు. సచివాలయంలో అమరావతి బ్యూటిఫికేషన్, గ్రీన్-బ్లూ మాస్టర్‌ప్లాన్‌పై ముఖ్యమంత్రి గురువారంసమీక్ష నిర్వహించారు. రాజధానిలో నిర్మితమవుతున్న ప్రధాన ట్రంక్ రోడ్లు, అనుబంధ రహదారులు, ఎల్పీఎస్ లేఅవుట్ల వద్ద నిర్మించే రహదారులు, బఫర్ జోన్లు, గ్రీన్ జోన్లు, ముఖ్యమైన కూడళ్లను అత్యంత ఆహ్లాదకరంగా ఉండేలా తీర్చిదిద్దేందుకు వీలుగా పచ్చదనాన్ని పెంపొందించాలని, రహదారుల వెంబడి అవెన్యూ ప్లాంటేషన్ చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో పార్కులు, హరిత ప్రాంతం ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఔషధ మొక్కలు నాటడంతో పాటు రాజధాని ప్రాంతమంతా జీవ వైవిధ్య ప్రాంతంగా మారాలని స్పష్టం చేశారు. గ్రీన్ బెల్ట్, బఫర్ జోన్లలో దేశీయ వృక్షజాతులు ఉండేలా చూడాలని, రివర్ ఫ్రంట్‌ను అత్యంత ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి సూచించారు.
బ్లూ, గ్రీన్, పుష్ప వికసిత రాజధాని
గ్రీన్, బ్లూ నగరంగా అమరావతిని తీర్చిదిద్దటంతో పాటు ఏడాది పొడవునా వివిధ కాలాల్లో వేర్వేరు జాతుల పుష్పాలు వికసించి ఆహ్లాద పరిచేలా మొక్కలు నాటాలని, ప్రజలు, పర్యాటకులు వాటి గురించి మాట్లాడుకునేలా ఈ పుష్పాలు సీజన్ల వారీగా వచ్చేలా ప్రణాళిక చేపట్టాలని చంద్రబాబు సూచించారు. రాజధాని ప్రాంతంలో వివిధ ఫల, పుష్ప జాతులకు చెందిన మొక్కలు, చెట్లు ఉండేలా కార్యాచరణ చేపట్టాలని, అమరావతిని సుందరంగా తీర్చిదిద్దేందుకు బెంగళూరు నగరంతో పాటు సింగపూర్ సహా వివిధ ప్రాంతాలను పరిశీలించాలన్నారు. ఔషధ మొక్కలు, అరుదైన, అంతరించిపోతున్న జాతుల మొక్కలు, వృక్షాలను సంరక్షిస్తున్న ప్రాంతంగా అమరావతి ఉండాలన్నారు. ఔషధ మొక్కలు పెంచేందుకు ప్రముఖ యోగా గురు బాబా రామ్‌దేవ్ నుంచి సూచనలు, సలహాలు తీసుకోవాలని, హిమాలయాల నుంచి కన్యాకుమారి వరకూ వివిధ ప్రాంతాల్లో ఉన్న దేశీయ వృక్ష జాతులను అమరావతిలో పెంచేందుకు చర్యలు చేపట్టాలన్నారు.
సేదతీరేలా కృష్ణా రివర్ ఫ్రంట్
రాజధాని అమరావతి నగరంలో అత్యంత నాణ్యమైన, అందరికీ అందుబాటులో గృహ నిర్మాణం ఉండాలని, సింగపూర్‌లోని బిడదారి హౌసింగ్ ప్రాజెక్టు తరహాలోనే గృహ నిర్మాణ ప్రాజెక్టుల వద్ద ఆహ్లాదకర వాతావరణం ఉండేలా చెట్లు, పార్కులు నిర్మించాలని సీఎం ఆదేశించారు. 250 ఎకరాల ప్రాంతంలో 10 వేల మంది నివసించేలా బిడదారి ఎస్టేట్‌ను నిర్మించారని, అలాగే ప్రకృతిలో సేదతీరేలా వివిధ ప్రాంతాలను తీర్చిదిద్దాలన్నారు. రాజధానిలో నిర్మించే వివిధ పార్కులకు వివిధ దేశాల పేర్లు పెట్టటంతో పాటు ఆయా దేశాల్లో పెరిగే పుష్ప జాతుల మొక్కలు ఉండేలా చూడాలని, ప్రధాన రహదారులకు ప్రకృతి పేర్లు కలిసొచ్చేలా పెట్టాలన్నారు. అమరావతిలో కొండవీటి వాగు, పాలవాగు సహా కాలువల వ్యవస్థలను, కృష్ణాతీరం ఇరువైపులా ఆహ్లాదకరమైన, అందమైన వాతావరణం ఉండేలా మార్చాలని సీఎం మార్గనిర్దేశనం చేశారు. రహదారి మార్గాలకు ఇరువైపులా సైక్లింగ్ ట్రాక్‌లు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సీఎం స్పష్టం చేశారు. శాఖమూరు రిజర్వాయర్‌ను 50 ఎకరాల ప్రాంతంలో సిద్ధం చేస్తున్నట్టు ఏడీసీ అధికారులు సీఎంకు వివరించగా… ఆ సరస్సు చుట్టూ గ్రీనింగ్‌తో పాటు సేదతీరేందుకు వీలుగా చెట్లు నాటాలని సీఎం సూచించారు.
కృష్ణానదిలో ప్రకాశం బ్యారేజికి ఎగువన ఉన్న ఆరు దీవులను కూడా సుందరంగా తీర్చిదిద్ది రివర్ ఫ్రంట్ ఏర్పాటు చేయనున్నట్టు అధికారులు వివరించగా… ఉండవల్లి కొండ ప్రాంతం నగరం మధ్యన ఉంటుందని, ఎక్కడి నుంచి చూసినా పూలతో అందమైన వనంలా కనిపించేలా మొక్కలు నాటాలని సీఎం సూచించారు.


