ఇష్టమైన పనులను వదిలేసి ఏడాది పాటు చదువుకే అంకితమయ్యా…
ప్రస్తుత నీట్ వివాదాల నేపథ్యంలో మాజీ ప్రపంచ సుందరి మానుషి చిల్లర్ వ్యాఖ్యలు
దేశవ్యాప్తంగా నీట్ పరీక్షపై తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్న ప్రస్తుత తరుణంలో మాజీ ప్రపంచ సుందరి, నటి మానుషి చిల్లర్ తన గతానుభవాలను పంచుకున్నారు. 2015లో నీట్ పేపర్ లీక్ కావడంతో మళ్లీ పరీక్ష రాయాల్సి రావడం తన జీవితంలోనే అత్యంత కఠినమైన దశల్లో ఒకటని ఆమె గుర్తుచేసుకున్నారు. ఇటీవలి విద్యార్థుల ఆందోళనలు, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా నేపథ్యంలో మానుషి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
నటి సోహా అలీ ఖాన్ పోడ్కాస్ట్లో మాట్లాడుతూ.. ఆనాటి అనుభవం కేవలం వ్యక్తిగతమైనదే కాదని, దేశంలోని లక్షలాది మంది విద్యార్థులు ఎదుర్కొంటున్న వాస్తవికతకు అద్దం పట్టిందని ఆమె అన్నారు. ఈ విషయంలో రెండు కోణాలున్నాయి. ఒకటి నా వ్యక్తిగత అనుభవం, రెండోది దేశంలోని చాలామంది విద్యార్థులు ఎదుర్కొంటున్న వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకోవడం అని మానుషి వివరించారు. తన తల్లిదండ్రులు కూడా వైద్య వృత్తిలో ఉండటంతో ఈ ప్రయాణానికి తాను మానసికంగా సిద్ధమయ్యానని, అయినప్పటికీ ఆ ప్రక్రియ ఎంతో భారం మోపిందని తెలిపారు.
నాకు సంతోషాన్నిచ్చే ప్రతిదాన్నీ త్యాగం చేయాల్సి వచ్చింది. నేను కూచిపూడి నర్తకిని, పెయింటింగ్ అంటే ఇష్టం. కానీ, ప్రవేశ పరీక్షపై దృష్టి పెట్టడానికి ఏడాది పాటు వాటన్నింటినీ పక్కన పెట్టాను అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పేపర్ లీక్ కారణంగా మరో 45 రోజులు అదనంగా చదవాల్సి వస్తుందని తెలిసినప్పుడు.. ఇంకా నాలో ఎంత శక్తి మిగిలి ఉంది? అని తనను తాను ప్రశ్నించుకున్నట్లు ఆమె చెప్పారు.
ఈ సందర్భంగా ఇతర విద్యార్థులు పడుతున్న కష్టాలను కూడా ఆమె గుర్తుచేసుకున్నారు. తమ పిల్లలను కోచింగ్ సెంటర్లకు పంపడానికి తల్లిదండ్రులు శక్తికి మించి అప్పులు చేయడం, ఎంతోమంది విద్యార్థులు నగరాలకు వలస వచ్చి ఇరుకైన పీజీ గదుల్లో ఉంటూ రోజంతా పరీక్షలకే సిద్ధమవ్వడం తాను చూశానని మానుషి తెలిపారు. అయితే, తన తల్లిదండ్రులు అందించిన మద్దతు, ప్రతిరోజూ గంటపాటు వ్యాయామం (బాస్కెట్బాల్ లేదా జిమ్) చేయడం తన మానసిక ఆరోగ్యాన్ని కాపాడిందని ఆమె పేర్కొన్నారు. ఁనా స్నేహితుల్లో చాలామందికి ఆ సౌకర్యం లేదు అని చెబుతూ, తాను ఎంతో అదృష్టవంతురాలినని అంగీకరించారు.
హర్యానాకు చెందిన మానుషి చిల్లర్, వైద్య విద్యను అభ్యసిస్తూనే అందాల పోటీల్లో పాల్గొని 2017లో మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలుచుకున్నారు. అక్షయ్ కుమార్ సరసన సామ్రాట్ పృథ్వీరాజ్ చిత్రంతో బాలీవుడ్లోకి అడుగుపెట్టి, ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ, బడే మియా ఛోటే మియా, టెహ్రాన్ వంటి చిత్రాల్లో నటించారు.


