మున్సిపాలిటీలకు మంత్రి నారాయణ శుభవార్త
ఆంధ్రప్రదేశ్ లోని మున్సిపాలిటీలకు మంత్రి నారాయణ శుభవార్త చెప్పారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బడ్జెట్‌లో మున్సిపల్ శాఖకు, సీఆర్డీఏ కు అధిక నిధులు కేటాయించినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలిపారు. గత ప్రభుత్వానికి పాలన చేతకాకపోవడంతో కేంద్రం ఇచ్చే 15వ ఆర్థిక సంఘం నిధులు సైతం మళ్లించారని, దీంతో రాష్ట్రాభివృద్ధి కుంటుపడిందన్నారు. ఇక మున్సిపల్ శాఖ విషయానికి వస్తే ప్రజలు మున్సిపాల్టీలు, కార్పొరేషన్లకు ప్రజలు చెల్లించే పన్నులు చట్టం ప్రకారం స్వపరిపాలనలో భాగంగా ఆ ప్రాంత అభివృద్ధికి ఖర్చు చేయవచ్చని అన్నారు.డ్రెయిన్లు శుభ్రం చేసుకోవడం, తాగు నీటి అవసరాలకు వినియోగించుకోవడం, స్వచ్ఛతా తదితర ప్రజోపయోగకర కార్యక్రమాలకు కౌన్సిల్ ఆమోదంతో ఖర్చు చేసుకోవచ్చని, అయితే గత ప్రభుత్వం స్వపరిపాలనకు చరమగీతం పాడుతూ సీఎఫ్ఎంఎస్‌కు మళ్లించడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయన్నారు. దీంతో కనీసం బ్లీచింగ్ కొనటానికి కూడా నిధులు లేక అల్లాడిపోయే పరిస్థితి నెలకొందని ఆవేధన వ్యక్తం చేశారు. ఈ ఏడాది ఏప్రియల్ ఒకటి నుంచి ఏ మున్సిపాల్టీలో వసూలయ్యే పన్నులు ఆ మున్సిపాల్టీయే ఖర్చు చేసుకునే అవకాశం కల్పించడం జరిగిందన్నారు. అందుకు సీఎం చంద్రబాబుకు మంత్రి నారాయణ ధన్యవాదాలు తెలిపారు.ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో అమరావతి టెండర్ల ప్రక్రియ ఆలస్యం అయిందని, మార్చి పదో తేదీన టెండర్లు ఖరారు చేసి ఆ తర్వాత పనులు ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. ప్రణాళికాబద్ధంగా అమరావతి నిర్మాణ పనులు చేస్తామన్నారు. మూడేళ్లలో అమరావతి నిర్మాణం పూర్తిచేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. రాజధాని స్వయం సమృద్ధి ప్రాజెక్టు అని, ఎక్కడా ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం నుంచి అదనంగా ఖర్చు పెట్టడం లేదన్నారు. రాష్ట్ర ప్రజలు కట్టే పన్నుల నుంచి ఒక్క పైసా కూడా దీనికి వినియోగించడం లేదని వారిపై ఎలాంటి భారం లేదని స్పష్టం చేశారు. అందుకే ప్రపంచ బ్యాంకు, ఈడీబీ, హడ్కో లాంటి సంస్థలు రాజధాని నిర్మాణానికి రుణాలు మంజూరు చేశాయని తెలిపారు. అమరావతి సీడ్ కేపిటల్ నుంచి 16 వ నెంబర్ జాతీయ రహదారికి కలిపే రోడ్ల నిర్మాణ పనులు త్వరలో ప్రారంభమవుతాయని మంత్రి చెప్పారు. వీటి తర్వాత మధ్యలో నిర్మాణం నిలిచిపోయిన సీడ్ యాక్సిస్ రోడ్ నిర్మాణం కూడా ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి నారాయణ వెల్లడించారు.
ఈ ఏప్రియల్ నుంచి మున్సిపాల్టీల నిధులు ఆయా మున్సిపాల్టీల అభివృద్దికే..
RELATED ARTICLES