హైకోర్టులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
రాష్ట్రాల హైకోర్టుల్లో వాదనలు పూర్తై తీర్పులను రిజర్వ్ చేసిన తర్వాత వాటి వెలువడటంలో జాప్యం జరగకుండా సుప్రీంకోర్టు కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. రిజర్వ్ చేసిన తీర్పులను గరిష్ఠంగా మూడునెలల్లోపు ప్రకటించాలని స్పష్టం చేసింది. తీర్పుల విడుదలలో ఆలస్యం కారణంగా న్యాయప్రక్రియపై ప్రభావం పడుతున్న నేపథ్యంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్,జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్ విపిన్ పంచోలి సభ్యులుగా ఉన్న ధర్మాసనం ఈ ఆదేశాలు వెలువరించింది.
వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన కేసుల్లో మూడు నెలల గడువుకు ముందుగానే తీర్పులు ఇవ్వాలని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. బెయిల్ అభ్యర్థనల విషయంలో అదే రోజున నిర్ణయం వెల్లడించడం ఉత్తమ విధానమని పేర్కొంది. ఒకవేళ తీర్పును రిజర్వ్ చేయాల్సి వస్తే,దానిని మరుసటి రోజే ప్రకటించాలని సూచించింది.
హైకోర్టులకు మార్గదర్శకాలు
బెయిల్ మంజూరైన వెంటనే సంబంధిత ఉత్తర్వులను అదే రోజున జైలు అధికారులకు పంపించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అలాగే విచారణలో ఉన్న ఖైదీలను బెయిల్ లభించిన రోజే, సాధ్యం కాకపోతే మరుసటి రోజున విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ట్రయల్ కోర్టులు నిర్దేశించిన విధానాలను అమలు చేసిన వెంటనే ఆ వివరాలను సంబంధిత రాష్ట్ర హైకోర్టులకు తెలియజేయాలని పేర్కొంది. తీర్పు ప్రకటించే సమయంలో అమలు చేయాల్సిన భాగాన్ని మాత్రమే బహిరంగ న్యాయస్థానంలో వెల్లడించాలని, పూర్తి కారణాలతో కూడిన తీర్పు ప్రతిని ఏడు రోజులలోపు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచాలని సూచించింది.
హైకోర్టులకు మార్గదర్శకాలు
ఈ మార్గదర్శకాల అమలుకు అవసరమైన సాంకేతిక, పరిపాలనా మార్పులను ఆయా హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల పర్యవేక్షణలో వెబ్‌సైట్‌లలో చేపట్టాలని ఆదేశించింది.
వాదనలు ముగిసిన తర్వాత తీర్పును రిజర్వ్ చేసిన తేదీ వివరాలను కూడా హైకోర్టు వెబ్‌సైట్‌లో స్పష్టంగా ప్రదర్శించాలని పేర్కొంది. రిజర్వ్ చేసిన తీర్పు మూడు నెలల గడువులో వెలువడకపోతే, ఆ విషయాన్ని రిజిస్ట్రార్ జనరల్ సంబంధిత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లాలని సుప్రీంకోర్టు తెలిపింది.
ఆ తర్వాత ప్రధాన న్యాయమూర్తి మరో రెండు వారాల గడువు ఇవ్వవచ్చని, అయినప్పటికీ తీర్పు రాకపోతే ఆ కేసును మరో ధర్మాసనానికి బదిలీ చేయాలని సూచించింది.
హైకోర్టులకు మార్గదర్శకాలు
అలాగే ఈ మార్గదర్శకాలను ఆయా హైకోర్టుల రిజిస్ట్రార్ జనరల్స్ తమ ప్రధాన న్యాయమూర్తుల ముందుంచి అమలు చర్యలు చేపట్టాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. 2025లో ఝార్ఖండ్ హైకోర్టు ఇచ్చిన ఒక తీర్పును వెబ్‌సైట్‌లో పొందుపరచడంలో జరిగిన జాప్యానికి సంబంధించి దాఖలైన పిటిషన్‌ను విచారించిన సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం ఈ కీలక మార్గదర్శకాలను జారీ చేసింది.


