పుట్టపర్తిలో ఏఎంసీఏ ప్రాజెక్టుకు శంకుస్థాపన
కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో కలిసి పాల్గొన్న సీఎం చంద్రబాబు
రూ.15,803 కోట్ల పెట్టుబడితో ఐదో తరం యుద్ధ విమానాల తయారీ
ఆంధ్రప్రదేశ్‌ను రక్షణ, వైమానిక రంగంలో కీలక కేంద్రంగా మార్చే దిశగా శుక్రవారం భారీ ముందడుగు పడింది. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో సుమారు రూ.15,803 కోట్ల భారీ వ్యయంతో ఏర్పాటు చేయనున్న అడ్వాన్స్‌డ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (ఏఎంసీఏ) ప్రాజెక్టుకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమం ద్వారా దేశీయంగా ఐదో తరం స్టెల్త్ ఫైటర్ జెట్‌ల అభివృద్ధి, తయారీకి మార్గం సుగమం కానుంది. ఈ కార్యక్రమంలో మంత్రులు నారా లోకేష్, సత్యకుమార్ యాదవ్, అనగాని సత్యప్రసాద్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ తదితరులు పాల్గొన్నారు. ఏఎంసీఏ ప్రాజెక్టుతో పాటు అనకాపల్లి జిల్లాలో భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్) నావల్ సిస్టమ్స్ యూనిట్, కర్నూలులో ఏర్పాటు చేయనున్న ఃడ్రోన్ సిటీః సహా మొత్తం రూ.4,145 కోట్ల విలువైన మరో 12 రక్షణ ప్రాజెక్టులకు కూడా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరిగాయి.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.. దేశానికి ఆంధ్రప్రదేశ్ రక్షణ కవచంగా నిలుస్తోందన్నారు. ఒకప్పుడు రతనాల సీమగా ఉన్న రాయలసీమను మళ్లీ అదే స్థాయికి తీసుకెళ్లే బాధ్యత నాది. కడప స్టీల్ ప్లాంట్ పనులను జూన్‌లో ప్రారంభించి 2028 నాటికి పూర్తి చేసి సీమకు కానుకగా ఇస్తాం,ఁ అని ఆయన హామీ ఇచ్చారు. ఈ ప్రాజెక్టుల ద్వారా వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం పేర్కొంది.
శంకుస్థాపన అనంతరం ఏర్పాటు చేసిన రక్షణ ఉత్పత్తుల ప్రదర్శనను సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్, మంత్రి లోకేష్ తిలకించారు. ఇందులో అత్యాధునిక క్షిపణులు, తుపాకులు, హ్యాండ్ గ్రెనేడ్లు, యుద్ధ విమానం ప్రోటోటైప్‌లను పరిశీలించారు. ఈ ప్రాజెక్టులను డీఆర్‌డీవో ఆధ్వర్యంలోని ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (ఏడీఏ) అభివృద్ధి చేస్తోంది.


