Homeజిల్లాలుతూర్పు గోదావరికడియం పేపర్ మిల్ కార్మికులు భారీ బైక్ ర్యాలీ

కడియం పేపర్ మిల్ కార్మికులు భారీ బైక్ ర్యాలీ

- Advertisement -

— జిల్లా కలెక్టర్, రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని డిమాండ్

విశాలాంధ్ర – కడియం : ఆంధ్రప్రదేశ్ పేపర్ మిల్, కడియం యూనిట్లో జరుగుతున్న కార్మికుల సమ్మె, యాజమాన్యం లాకౌట్ విషయాలలో జిల్లా కలెక్టర్, రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని సమస్యలు పరిష్కరించాలని సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు టి అరుణ్ డిమాండ్ చేశారు. గత 18 రోజులుగా కార్మికులు ఆందోళన చేస్తున్నప్పటికీ, పట్టించుకోని యాజమాన్యం నిరంకుశ వైఖరికి నిరసిస్తూ గురువారం భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. స్థానిక ప్రజాప్రతినిధుల ప్రజల మద్దతు కోరుతూ బయలుదేరిన ఈ బైక్ ర్యాలీ మిల్లు చుట్టూ ఉన్న జేగురుపాడు, మాధవరాయుడు పాలెం, కడియపు సావరం, కడియం, రాజవోలు గ్రామాల మీదుగా సాగి, పేపర్ మిల్ కు చేరింది. ర్యాలీలో భాగంగా కడియం దేవీ చౌక్ సెంటర్ వద్ద కార్మికులు కొద్దిసేపు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా అరుణ్ మాట్లాడుతూ కార్మికులకు జీతాలు పెంచాలని, వేతన ఒప్పందం జరపాలని, అక్రమ లాకౌట్ అక్రమ సస్పెన్షన్ లను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. వేతన ఒప్పందం గడువు ముగిసి మూడు సంవత్సరాలు పూర్తయినప్పటికీ, నూతన వేతన ఒప్పందం జరిపేందుకు పేపర్ మిల్ యజమాన్యం నేటికీ నిర్లక్ష్యం వహిస్తుందని పేర్కొన్నారు. 15 నుంచి 20 సంవత్సరాలు సర్వీస్ ఉన్న కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేయకుండా, వేతనాలు పెంచకుండా, ఓవర్ టైం కు రెట్టింపు వేతనం ఇవ్వకుండా కార్మికుల శ్రమను తీవ్రంగా దోపిడీ చేస్తుందన్నారు. పర్మినెంట్ కార్మికులకు కూడా వేతన ఒప్పందం జరపకుండా చర్చలతో కాలయాపన చేస్తుందన్నారు. దీర్ఘకాలంగా వేతనాలు పెంచక పోవడం వల్ల కార్మికులు ధరల ప్రభావంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆందోళన చేస్తున్న 59 మంది కాంట్రాక్ట్ కార్మికులను, సమస్యలు పరిష్కరించమని లేఖ రాసిన 11 మంది పర్మినెంట్ కార్మికులను యాజమాన్యం నిరంకుశంగా సస్పెండ్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. కోట్లాది రూపాయలు లాభాలు వస్తున్నా, కార్మికుల జీతాలు పెంచని యాజమాన్య వైఖరిని ఖండించారు. అన్ని గ్రామాలలో ఉన్న రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు కార్మికులకు అండగా ఉంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బి పూర్ణిమ రాజు, కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి జె రాంబాబు, పర్మినెంట్ కార్మికులు, కాంటాక్ట్ కార్మికులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు