హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చంబా జిల్లాలో ప్రయాణికులతో వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు అదుపుతప్పి సుమారు 100 అడుగుల లోతైన లోయలో పడిపోయింది.ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా.. మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో బస్సు డ్రైవర్, కండక్టర్ కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.శర్మ ట్రావెలర్స్‌కు చెందిన ఈ బస్సు శనివారం ఉదయం సుమారు 6.30 గంటలకు బైరాగఢ్ నుంచి చంబా పట్టణానికి బయలుదేరింది.దాదాపు మూడు కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత చాలుజ్ మలుపు వద్ద ప్రమాదానికి గురైంది.మలుపు తిరుగుతున్న సమయంలో డ్రైవర్ బస్సుపై నియంత్రణ కోల్పోవడంతో వాహనం రోడ్డుపై నుంచి జారి లోయలో పడిపోయినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది.
ప్రమాదం అనంతరం బస్సు లోయలోని మరో రహదారిపై పడింది. భారీ ఎత్తు నుంచి పడటంతో వాహనం పూర్తిగా నుజ్జునుజ్జయింది.బస్సులో చిక్కుకున్న బాధితులను బయటకు తీసేందుకు సహాయక బృందాలు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది.ప్రమాదంలో గాయపడిన 11 మందిని తిస్సా పట్టణంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారి పరిస్థితిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


