ఇళ్ల స్థలాలు మంజూరు చేసే వరకు పోరాటం ఆగదు
సిపిఐ నంద్యాల జిల్లా కార్యదర్శి రంగనాయుడు
విశాలాంధ్ర. నందికొట్కూరు : రాష్ట్ర ప్రభుత్వం ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేసేంత వరకు భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) తరఫున పోరాడుతామని సిపిఐ జిల్లా కార్యదర్శి రంగనాయుడు సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు రఘురామ్ మూర్తి లు రాష్ట్ర ప్రభుత్వాన్నిహెచ్చరించారు. ఈ సందర్భంగా నందికొట్కూరు పట్టణంలోని పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరుతూ సోమవారం సిపిఐ పట్టణ కార్యదర్శి శ్రీనివాసులు అధ్యక్షతన సిపిఐ కార్యాలయం స్వామి రెడ్డి భవన్ నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వచ్చి పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్లు స్థలం ఇస్తామని హామీ ఇచ్చిన మేరకు రాష్ట్ర కేబినెట్లో తీర్మానం చేసిన నేపథ్యంలో అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. గతంలో ఒక సెంటు పేద ప్రజలను ఉద్ధరించినట్లుగా చెప్పుకున్నాడని జగన్మోహన్ రెడ్డిని విమర్శించిన కూటమి ప్రభుత్వ పెద్దలు ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అనేకమంది ఇల్లు లేని పేద ప్రజలు ఉన్నారని పేద ప్రజల తరఫున సిపిఐ అండగా ఉంటుందన్నారు.కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడు నెలలు గడుస్తున్నా సూపర్ సిక్స్ పథకాలు అమలు చెయ్యలేదని,ఒక పింఛన్ మాత్రమే ఇచ్చి ప్రజాఆర్భాటాలు తప్ప మిగతా హామీలు అమలు చేయలేదన్నారు .రాష్ట్ర ప్రభుత్వం పేదలకు తక్షణమే ఇళ్ల స్థలాలు కేటాయించి, ఇంటి నిర్మాణానికి రూ, 5 లక్షల మంజూరు చేసి ,సొంతింటి కళ ను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. అనంతరం తహశీల్దార్ శ్రీనివాసులు కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ మహిళా సంఘం జిల్లా కార్యదర్శి రజితమ్మ, సిపిఐ మండల కార్యదర్శి అబ్దుల్ మజీద్ , సిపిఐ జిల్లా నాయకులు ప్రసాద్, ఏఐఎస్ఎఫ్ నాయకులు మహానంది, వినోదు, దినేష్ ఆయా కాలనీలా ప్రజలు పాల్గొన్నారు.