కేరళలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన ప్రియదర్శిని ఉచిత బస్సు ప్రయాణ పథకం తీవ్ర వివాదానికి కారణమైంది. ప్రభుత్వ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడం వల్ల తాము ఆర్థికంగా కుదేలవుతున్నామని ఆరోపిస్తూ, రాష్ట్రంలోని ప్రైవేట్ బస్సు ఆపరేటర్లు ఈ నెల 20 నుంచి నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చారు.ముఖ్యమంత్రి వి.డి.సతీశన్ సర్కార్ ఃఇందిరా గ్యారెంటీఃలో భాగంగా జూన్ 15న ఈ పథకాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా కేరళ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (కేఎస్ఆర్టీసీ) ఆర్డినరీ బస్సుల్లో మహిళలు, ట్రాన్స్జెండర్లు ఉచితంగా ప్రయాణించవచ్చు. అయితే, కేవలం ప్రభుత్వ బస్సులకే ఈ పథకాన్ని పరిమితం చేయడంతో ప్రయాణికులు ప్రైవేట్ బస్సులను ఆశ్రయించడం తగ్గించారు. ఫలితంగా, నెల రోజుల్లోనే నష్టాలు భరించలేక సుమారు 500 ప్రైవేట్ బస్సులు తమ సర్వీసులను నిలిపివేశాయి.
ప్రభుత్వ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడాన్ని మేము వ్యతిరేకించడం లేదు. కానీ, అదే తరహా సబ్సిడీలు, రాయితీలను మాకు కూడా వర్తింపజేయాలిఁ అని ఆల్ కేరళ బస్ ఆపరేటర్స్ ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ టి. గోపినాథన్ డిమాండ్ చేశారు. ఈ పరిశ్రమపై ఆధారపడిన 28,000 కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 70 శాతం రూట్లలో ప్రైవేట్ బస్సులే (7,000) సేవలందిస్తుండగా, ప్రభుత్వ బస్సులు (4,000) మూడో వంతు మాత్రమే ఉన్నాయి.
మరోవైపు, ఈ పథకం ప్రైవేట్ ఆపరేటర్లనే కాకుండా, ప్రభుత్వ రంగ సంస్థ అయిన కేఎస్ఆర్టీసీని కూడా ఆర్థికంగా దెబ్బతీస్తుందని రవాణా శాఖ మాజీ మంత్రి కె.బి.గణేశ్ కుమార్ హెచ్చరించారు. ఇప్పటికే రూ. 21,000 కోట్ల పేరుకుపోయిన నష్టాలతో సతమతమవుతున్న కేఎస్ఆర్టీసీకి ఈ పథకం వల్ల ఏటా అదనంగా రూ. 700 కోట్ల భారం పడనుంది. ఈ నష్టాన్ని పూడ్చుకోవడానికి బస్సు టికెట్ల వెనుక ప్రైవేట్ ప్రకటనలు వేయడం వంటి ప్రత్యామ్నాయాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. సమ్మెను నివారించాలంటే, ప్రైవేట్ బస్సుల్లోనూ ఈ పథకాన్ని అమలు చేసే అంశాన్ని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.


