సింగరేణి సంస్థకు జాతీయ స్థాయిలో మరో ప్రతిష్ఠాత్మక గుర్తింపు లభించింది. కేంద్ర బొగ్గుగనుల మంత్రిత్వ శాఖ ప్రకటించిన తాజా 5 స్టార్ రేటింగ్‌ల జాబితాలో సింగరేణికి చెందిన ఐదు గనులు చోటు దక్కించుకున్నాయి.పనితీరు, భద్రత, పర్యావరణ పరిరక్షణ, గనుల నిర్వహణ వంటి ప్రమాణాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన గనులకు ఈ గుర్తింపు లభించింది. ఈ జాబితాలో శ్రీరాంపూర్ ఏరియాకు చెందిన ఆర్‌కే న్యూటెక్, ఆర్‌కే-6, సత్తుపల్లి ఏరియాలోని జేవీఆర్ ఓసీ-2, బెల్లంపల్లి ప్రాంతానికి చెందిన ఖైరిగూడ ఓపెన్‌కాస్ట్, రామగుండం-3 ఏరియాలోని జీఆర్ ఓసీ-1 గనులు 5 స్టార్ రేటింగ్‌ను సొంతం చేసుకున్నాయి.
సింగరేణి పరిధిలోని 17 గనులు 4 స్టార్ రేటింగ్
దేశవ్యాప్తంగా మొత్తం 382 గనులు ఈ రేటింగ్ కోసం దరఖాస్తు చేసుకోగా,కఠినమైన ప్రమాణాల ఆధారంగా 50 గనులను మాత్రమే కేంద్రం ఎంపిక చేసింది. వీటిలో సింగరేణికి చెందిన ఐదు గనులు చోటు దక్కించుకోవడం సంస్థకు గర్వకారణమని సింగరేణి ఒక ప్రకటనలో వెల్లడించింది. గత ఏడాది సింగరేణికి చెందిన నాలుగు గనులు మాత్రమే 5 స్టార్ రేటింగ్‌ను సాధించగా,ఈసారి ఆ సంఖ్య ఐదుకు పెరగడం విశేషంగా నిలిచింది.మరోవైపు,ప్రస్తుత సంవత్సరానికి సంబంధించిన 4 స్టార్ రేటింగ్‌ను సింగరేణి పరిధిలోని 17 గనులు పొందాయి.ఈ సందర్భంగా డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సంతోషం వ్యక్తం చేశారు. జాతీయ స్థాయిలో సింగరేణి ప్రతిష్ఠను మరింత పెంచిన ఉద్యోగులు, కార్మికులు, అధికారులు అందరికీ ఆయన అభినందనలు తెలిపారు.


