Tuesday, April 15, 2025
Homeఆంధ్రప్రదేశ్టైప్-5 డయాబెటిస్‌ను అధికారికంగా గుర్తించిన ఐడీఎఫ్

టైప్-5 డయాబెటిస్‌ను అధికారికంగా గుర్తించిన ఐడీఎఫ్

2.5 కోట్ల మంది దీని బారినపడే అవకాశం

రోగ నిర్ధారణ తర్వాత ఏడాదికి మించి బతకడం కష్టమంటున్న నిపుణులు

పోషకాహార లోపం వల్ల వచ్చే టైప్-5 డయాబెటిస్

చాపకింద నీరులా ప్రపంచం మొత్తం పాకేసిన మధుమేహంలో మరో కొత్త రకాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇంటర్నేషనల్ డయాబెటిస్ ఫెడరేషన్ (ఐడీఎఫ్) టైప్-5 డయాబెటిస్‌ను అధికారికంగా గుర్తించింది. ఇది పోషకాహార లోపం వల్ల వచ్చే మధుమేహమని పేర్కొంది. అతి తక్కువ, మధ్యస్థ ఆదాయం కలిగిన దేశాల్లో సన్నగా ఉండేవారు, పోషకాహార లోపంతో బాధపడే యువకుల్లో ఇది వచ్చే అవకాశం ఉందని ఐడీఎఫ్ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా 2 నుంచి రెండున్నర కోట్ల మంది దీని బారిపడే అవకాశం ఉందని పేర్కొంది.

పోషకాహార లోపానికి సంబంధించిన మధుమేహం చారిత్రాత్మకంగా నిర్ధారణ చేయబడిందని హరోల్డ్ అండ్ మురీల్ బ్లాక్ చైర్ పర్సన్ ప్రొఫెసర్ మెరెడిత్ హాకిన్స్ తెలిపారు. ఐడీఎఫ్ దీనిని టైప్-5 డయాబెటిస్‌గా గుర్తించడం వినాశకరమైన ఆరోగ్య సమస్యపై అవగాహన పెంచే దిశగా ఒక ముఖ్యమైన ముందడుగు అని పేర్కొన్నారు. స్థూలకాయం వల్ల వచ్చే మధుమేహాన్ని టైప్-2 డయాబెటిస్ అంటారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఇది ఎక్కువగా ఉంది. అయితే, ఆహారం తక్కువగా తీసుకున్నా పోషకాహార లోపం వల్ల కూడా యువకులు డయాబెటిస్ బారిన పడుతున్నారని డాక్టర్ హాకిన్స్ తెలిపారు.

ఆసియా, ఆఫ్రికా సహా ప్రపంచవ్యాప్తంగా 2 నుంచి 2.5 కోట్ల మంది ఈ టైప్-5 డయాబెటిస్ బారినపడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ రోగులకు ఎలాంటి చికిత్స అందించాలన్న విషయంలో వైద్యులకు కూడా అంతుబట్టడం లేదన్నారు. రోగ నిర్ధారణ తర్వాత వారు ఏడాదికి మించి జీవించే అవకాశం లేదని పేర్కొన్నారు. పోషకాహార లోపం కారణంగా వచ్చే డయాబెటిస్‌ను 70 ఏళ్ల క్రితమే గుర్తించారు. 1985లో దీనిని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) గుర్తించింది. అయితే, దీనికి సంబంధించిన ఆధారాలు, అధ్యయనాలు లేకపోవడంతో 1999లో దీనిని తొలగించింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు