ఆశించిన స్థాయిలో పనితీరు లేదన్న కారణంతో గతేడాది ఆరుగురు మహిళా సివిల్ జడ్జ్‌లను మధ్యప్రదేశ్ హైకోర్టు విధుల నుంచి తొలగించింది. వారిలో నలుగురిని మళ్లీ విధుల్లోకి తీసుకోవాలని హైకోర్టు పూర్తిస్థాయి ధర్మాసనం నిర్ణయించగా, మిగతా ఇద్దరికి మాత్రం నిరాశే ఎదురైంది. ఇద్దరిలో ఒక న్యాయమూర్తి తనకు గర్భస్రావం అయిందని, తన సోదరుడు క్యాన్సర్‌తో బాధపడుతున్నాడని చెబుతూ వివరణ ఇచ్చినప్పటికీ హైకోర్టులో ఆమెకు ఉపశమనం లభించలేదు. దీంతో ఈ కేసును సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది.తాజాగా ఈ కేసును విచారించిన జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఎన్ కోటీశ్వర్‌సింగ్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం హైకోర్టు వైఖరిని తీవ్రంగా తప్పుబట్టింది. గర్భస్రావం కారణంగా మహిళా న్యాయమూర్తి అనుభవించిన మానసిక, శారీరక క్షోభను హైకోర్టు విస్మరించిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. పురుషులకు కూడా నెలసరి వస్తే అప్పుడు వారి బాధ తెలిసేదని వ్యాఖ్యానించింది. ఆమెకు గర్భవిచ్ఛిత్తి జరగడంతో ఆమె మానసికంగా, శారీరకంగా ఎంతో వేదనకు గురయ్యే అవకాశం ఉందని, పురుషులకు కూడా రుతుక్రమం వస్తే సమస్య ఏంటనేది తెలిసేదని పేర్కొంది.
ఆరోగ్య పరిస్థితులు తెలుసుకోకుండా కేవలం పనితీరు ఆధారంగా ఆమెను తొలగిస్తూ హైకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని జస్టిస్ బీవీ నాగరత్న తప్పుబట్టారు. అటువంటి ప్రమాణాలే పురుష న్యాయమూర్తులకూ ఉండాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. సివిల్ జడ్జ్‌ల తొలగింపు విధివిధానాలపై వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈ నెల 12కు వాయిదా వేసింది.