- స్మార్ట్ మీటర్ల ఏర్పాటును ఉపసంహరించుకోవాలి
- ఆదానితో జరిగిన విద్యుత్ ఒప్పందాలను రద్దు చేయాలి
విశాలాంధ్ర – పలాస:ప్రజల పైన ఎటువంటి భారాలు వేయమని చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ట్రూ అప్ చార్జీల పేరుతో ప్రజల పైన భారం మోపిందని వామపక్ష పార్టీల నాయకులు అన్నారు. కాశిబుగ్గ లోని ఓ ప్రైవేట్ ఫంక్షన హాల్లో సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ,సిపిఐ ఎం.ఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి తామాడ సన్యాసిరావు,సిపిఎం నాయకులు ఎన్.గణపతి, సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర కమిటీ సభ్యులు వంకలు మాధవరావు, రామారావు కుసుమ బాలకృష్ణ తదితరులు మాట్లాడుతూ పేదలపై విద్యుత్ బారాలను మోపడం సరికాదని అన్నారు. గత వైసిపి ప్రభుత్వం హయంలో స్మార్ట్ మీటర్లను బిగించినప్పుడు కూటమి ప్రభుత్వ నాయకులు స్మార్ట్ మీటర్లు బిగిస్తే ధ్వంసం చేయమని చెప్పిన మాటలు ఇప్పుడు ఏమయ్యాయో ప్రజలకు చెప్పాలన్నారు. ఆదానితో ఏర్పాటు చేసుకున్న సేకి ఒప్పందాన్ని రద్దు చేయమని డిమాండ్ చేసిన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి మారిపోయిందని , అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరొక మాటగా ప్రభుత్వం కొనసాగుతుందని తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్ మీటర్ల పేరుతో ప్రజలను మోసగించవద్దని అన్నారు. రాష్ట్రంలో డబల్ ఇంజన్ సర్కార్ కరెంట్ చార్జీల భారాన్ని పేద ప్రజలపై వేయడం తగదని, స్మార్ట్ మీటర్ల తో సాగుతున్న దోపిడీని అరికట్టాలని, స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని , ఆదానితో కేంద్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాన్ని రద్దుచేసి ముఖ్యమంత్రి పారదర్శకత్వం నిరూపించుకోవాలని అన్నారు. ఒక ప్రక్క పేద ప్రజలు పొట్టకూటి కోసం అనేక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో కరెంట్ చార్జీలు పెంచడం ఎంతవరకు సమంజసం అని, కూటమి ప్రభుత్వం ఏర్పడిన సంవత్సర కాలంలో ఇప్పటికే నాలుగు సార్లు విద్యుత్ చార్జీలను పెంచి ప్రజలపై పెను భారాన్ని మోపిందన్నారు. ప్రభుత్వం స్మార్ట్ మీటర్ ను రద్దుచేసి, కరెంట్ చార్జీలు తగ్గించాలని కోరుతూ ఆగస్టు 5వ తేదీన మండల కేంద్రాల్లో జరిగే ధర్నా కార్యక్రమాన్ని ప్రజలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సిహెచ్ రవి, వీరస్వామి, అప్పన్న, ముకుందరావు, సాయి, ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.


