నూతన ఆవిష్కరణల్లో జిల్లా విద్యార్థులు జాతీయ స్థాయికి వెళ్ళాలి
జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి
విశాలాంధ్ర -అనంతపురం : విద్యార్థుల్లో సైన్స్ పట్ల ఆసక్తిని పెంచాలని, వారిలో శాస్త్రీయ విధానంలో ఆలోచన శక్తిని, నూతన ఆవిష్కరణలు చేసే సామర్థ్యాలను పెంపొందించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి ఆదేశించారు. గురువారం అనంతపురం నగరంలోని శారద నగర్ లో ఉన్న జిల్లా సైన్స్ మ్యూజియంలో సమగ్ర శిక్ష మరియు విద్యాశాఖ ఆధ్వర్యంలో అటల్ టింకరింగ్ ల్యాబ్స్ పై జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భారత ప్రభుత్వం అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ను ఏర్పాటు చేయడం జరగగా, జిల్లాలో 21 ల్యాబ్ లను మంజూరు చేయగా, అందులో 19 ల్యాబ్స్ ప్రస్తుతం పని చేయడం జరుగుతుండగా, వాటిలో 18 ప్రభుత్వ పాఠశాలల్లో, ఒక ప్రైవేట్ పాఠశాలలో ల్యాబ్స్ నడుస్తున్నాయన్నారు. నిబంధనల ప్రకారం ఆయా పాఠశాలల అటల్ టింకరింగ్ ల్యాబ్స్ నోడల్ అధికారులకు వర్క్ షాప్ నిర్వహించాలని, వారికి ప్రాథమిక శిక్షణ ఇవ్వాలని, శిక్షణ తీసుకున్న వారు వారి పాఠశాలలో మరొకరికి శిక్షణ ఇవ్వాలని, శిక్షణకు సంబంధించి షెడ్యూల్ సిద్ధం చేయాలని, నోడల్ టీచర్లతో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేయాలన్నారు. అన్ని పాఠశాలల్లో ల్యాబ్స్ కార్యకలాపాలను నిత్యం కొనసాగించాలని ఆదేశించారు. విద్యార్థుల్లో సైన్స్ పట్ల ఆసక్తిని కలిగించి వారిలో సైన్స్ దృక్పథాన్ని ఏర్పాటు చేయాలని, వారికి సైన్స్ ల్యాబ్ ని అందుబాటులో ఉంచాలన్నారు.
ఈ సమావేశంలో డీఈవో ప్రసాద్ బాబు, సమగ్ర శిక్ష ఏపీసి నాగరాజు, సైన్స్ ఆఫీసర్ బాలమురళీకృష్ణ, డిపిఎం నాగరాజు, ఆయా కళాశాలల హెడ్ మాస్టర్లు, ప్రిన్సిపాల్స్, తదితరులు పాల్గొన్నారు.