పహల్గామ్ దాడిని ఖండించిన ఆంటోనియో గుటెర్రస్
ఉద్రిక్తతలను తగ్గించేందుకు మధ్యవర్తిత్వానికి సిద్ధమని ప్రకటన
పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ తమపై సైనిక చర్యకు సిద్ధమవుతోందని పాకిస్థాన్ ప్రభుత్వం ఆరోపించింది. దీంతో ఐక్యరాజ్య సమితి రంగంలోకి దిగింది. మంగళవారం ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ ఇరు దేశాలకు ఫోన్ చేశారు. భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్, పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ లతో ఫోన్ లో మాట్లాడారు. ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించిన గుటెర్రస్.. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు మధ్యవర్తిత్వానికి సిద్ధమని తెలిపారు. అన్ని రకాల ఉగ్రవాదాన్ని పాకిస్థాన్ ఖండిస్తుందని, పహల్గామ్ ఘటనపై భారత్ చేస్తున్న ఆరోపణలను తిరస్కరిస్తున్నామని షరీఫ్ స్పష్టం చేశారు. ఈ ఘటనపై పారదర్శక, తటస్థ దర్యాప్తు జరపాలని, కశ్మీర్ వివాదాన్ని ఐరాస భద్రతా మండలి తీర్మానాల ప్రకారం పరిష్కరించాలని గుటెర్రస్‌ను కోరినట్లు తెలిపారు. శాంతికి కట్టుబడి ఉంటామని, అయితే సార్వభౌమాధికారాన్ని సవాల్ చేస్తే పూర్తి శక్తితో ప్రతిఘటిస్తామని ఆయన పేర్కొన్నారు. మరోవైపు, యూఎన్ సెక్రటరీ జనరల్ గుటెర్రస్‌తో జరిగిన సంభాషణ వివరాలను భారత విదేశాంగ మంత్రి జైశంకర్ వెల్లడించారు. పహల్గామ్ ఉగ్రదాడిని గుటెర్రస్ నిస్సందేహంగా ఖండించడాన్ని అభినందిస్తున్నట్లు తెలిపారు. దాడికి పాల్పడిన వారిని, ప్రణాళిక రచించిన వారిని, వారికి సహకరించిన వారిని చట్ట ప్రకారం కచ్చితంగా శిక్షించాల్సిన అవసరం ఉందని ఇరువురం ఏకీభవించామని జైశంకర్ పేర్కొన్నారు. ఈ విషయంలో భారత్ దృఢ నిశ్చయంతో ఉందని ఆయన స్పష్టం చేశారు.
ఈ ఫోన్ కాల్స్‌ను యూఎన్ అధికార ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్ ధృవీకరించారు. ఏప్రిల్ 22 నాటి ఉగ్రదాడిని సెక్రటరీ జనరల్ తీవ్రంగా ఖండించారని, చట్టబద్ధమైన మార్గాల ద్వారా బాధ్యులను గుర్తించి న్యాయం చేయాల్సిన ఆవశ్యకతను నొక్కిచెప్పారని తెలిపారు. ఉద్రిక్తతలు తగ్గించేందుకు అవసరమైన సహాయ సహకారాలు అందించడానికి, మధ్యవర్తిత్వం వహించడానికి సెక్రటరీ జనరల్ సిద్ధంగా ఉన్నారని డుజారిక్ వెల్లడించారు.