Friday, May 9, 2025
Homeఆంధ్రప్రదేశ్జడ్ ప్లస్ సెక్యూరిటీని పునరుద్ధరించాలని కోరుతూ హైకోర్టులో జగన్ పిటిషన్

జడ్ ప్లస్ సెక్యూరిటీని పునరుద్ధరించాలని కోరుతూ హైకోర్టులో జగన్ పిటిషన్

రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత తన భద్రతను భారీగా తగ్గించారని, తనకు ప్రాణహాని ఉందని ఆరోపిస్తూ వైసీపీ అధినేత జగన్ హైకోర్టును ఆశ్రయించారు. తనకు జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతను పునరుద్ధరించాలని, ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని కోరుతూ ఆయన నిన్న ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు ఈరోజు విచారణ చేపట్టనుంది. తనకు ఉన్న ప్రాణహానిని పరిగణనలోకి తీసుకుని, నిర్దేశిత ప్రొటోకాల్ ప్రకారం జడ్ ప్లస్ భద్రతను తిరిగి కల్పించాలని జగన్ తన పిటిషన్‌లో అభ్యర్థించారు. తన నివాసం, కార్యాలయం వద్ద పటిష్టమైన భద్రతతో పాటు, జామర్లు, పూర్తిస్థాయిలో పనిచేసే బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని సమకూర్చాలని కోరారు. ఒకవేళ ప్రభుత్వం వాహనం సమకూర్చలేని పక్షంలో, తన సొంత బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని వాడుకునేందుకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. తనకున్న ముప్పు దృష్ట్యా తక్షణమే సీఆర్‌పీఎఫ్ లేదా ఎన్‌ఎస్‌జీ బలగాలతో తగిన భద్రత కల్పించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని విన్నవించారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత ఎలాంటి ముందస్తు సమాచారం గానీ, నోటీసు గానీ ఇవ్వకుండా తన భద్రతను భారీగా తగ్గించేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తన ప్రాణాలకు ముప్పు ఉందని పలుమార్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వినతిపత్రాలు సమర్పించినప్పటికీ ఫలితం లేకపోవడంతోనే హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని వివరించారు. ప్రస్తుతం తనకు కేటాయించిన భద్రత నామమాత్రంగా ఉందని, బుల్లెట్ ప్రూఫ్ వాహనం సరిగా పని చేయడం లేదని జగన్ తెలిపారు. అధికార కూటమికి చెందిన నేతల నుంచి తనకు భౌతికంగా హాని తలపెడతామంటూ బెదిరింపులు వస్తున్నాయని పేర్కొన్నారు. పలు పర్యటనల్లో ప్రభుత్వం కనీస భద్రత కూడా కల్పించలేదని, గుంటూరు మిర్చి యార్డుకు వెళ్లినప్పుడు ఒక్క కానిస్టేబుల్‌ను కూడా నియమించలేదని గుర్తుచేశారు. ఇటీవల శ్రీ సత్యసాయి జిల్లా పర్యటనలోనూ హెలిప్యాడ్ వద్ద భద్రతా లోపాలు స్పష్టంగా కనిపించాయని, దీనిపై పోలీసులు ఇప్పుడు విచారణ జరుపుతున్నారని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు