వర్కింగ్ జర్నలిస్టుల అక్రెడిటేషన్ నియమాల జీవో వెంటనే విడుదల చేయాలని, పనిచేస్తున్న జర్నలిస్టులందరికీ వెంటనే అక్రెడిటేషన్లు ఇవ్వాలని , రాష్ట్రంలో జర్నలిస్టుల పెండింగు సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ ఆగస్ట్ 5 న రాష్ట్రవ్యాప్త కోర్కెల దినం పాటించాలని, ఆంధ్ర ప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ( APUWJ) రాష్ట్ర కార్యవర్గ సమావేశం పిలుపు ఇచ్చింది. సమావేశం జులై 26 వ తేదీన ఏలూరులో రాష్ట్ర అధ్యక్షుడు ఐ.వి.సుబ్బారావు అధ్యక్షతన జరిగింది. సమావేశానికి సి.ఆర్.మీడియా అకాడమీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ , ఐజేయూ జాతీయ కార్యవర్గ సభ్యులు ఆలపాటి సురేష్ కుమార్, ఐజేయు జాతీయ కార్యదర్శి డి.సోమసుందర్, ఐజేయూ జాతీయ కార్యవర్గ సభ్యులు నల్లి ధర్మారావు , డా. ఎం.ప్రసాద్, ఎలెక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఏచూరి శివ, యూనియన్ పూర్వ ప్రధానకార్యదర్శి చందు జనార్దన్ హాజరయ్యారు.
రాష్ట్రంలో జర్నలిస్టులు ఎదుర్కుంటున్న పలు సమస్యలపై సమావేశం చర్చించింది. అక్రెడిటేషన్ నియమాల జీవో విడుదలలో జరుగుతున్న అనవసర జాప్యంపై సమావేశం అసంతృప్తి వ్యక్తం చేసింది. రాష్ట్రంలో గత ప్రభుత్వం వేలాదిమంది జర్నలిస్టులకు అక్రెడిటేషన్ లేకుండా చేసిందని, కూటమి ప్రభుత్వం అధికారం లోకి వచ్చి ఏడాది గడిచినా గత ప్రభుత్వం చేసిన పొరపాటును సరిదిద్దకపోవడంపై సమావేశం నిరసన వ్యక్తం చేసింది. ఇప్పటికే పాత అక్రెడిటేషన్లు గడువును మూడు సార్లు పొడిగించారని , ఆగస్ట్ నెలాఖరులోగా కొత్త అక్రెడిటేషన్లు ఇవ్వకపోతే మరోసారి గడువు పొడిగించాల్సి వస్తుందనీ కార్యవర్గం అభిప్రాయ పడింది. కొత్త అక్రెడిటేషన్ జారీ చేయకపోవడం వల్ల వేలాదిమంది జర్నలిస్టులు హెల్త్ కార్డ్ సదుపాయాన్ని వినియోగించుకోలేని పరిస్తితి ఎదురవుతుందని సమావేశం ఆందోళన వ్యక్తం చేసింది.వర్కింగ్ జర్నలిస్ట్స్ హెల్త్ కార్డ్ ను వివిధ నెట్ వర్క్ ఆస్పత్రులలో అనుమతించడం లేదని, దీనిపై ప్రభుత్వం తగిన త్రైపాక్షిక పర్యవేక్షక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని యూనియన్ డిమాండ్ చేసింది. గతంలో అమల్లో ఉన్న ప్రమాద బీమా పథకాన్ని తక్షణం పునరుద్ధరించాలని , జర్నలిస్టుల ఇళ్ళ స్థలాల సమస్యపై దృష్టి సారించాలని, దాడుల నివారణ కమిటీ ఏర్పాటు చేయాలని యూనియన్ రాష్ట్ర కార్యవర్గం డిమాండ్ చేసింది.
రాష్ట్రంలో జర్నలిస్టుల అపరిష్కృత సమస్యల పరిష్కారం కోరుతూ ఆగస్ట్ 5 వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా కోర్కెల దినం పాటించాలని కార్యవర్గం పిలుపు ఇచ్చింది.
ఆగస్ట్ 17 వ తేదీన ఏ.పీ.యూ. డబ్ల్యూ.జే. 69 వ ఆవిర్భావ దినోత్సవాన్ని వివిధ రూపాలలో ఘనంగా నిర్వహించాలని యూనియన్ పిలుపు ఇచ్చింది. సెప్టెంబర్ లో రాష్ట్ర ఎలెక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్స్ అసోసియేషన్, సామ్నా రాష్ట్ర సమావేశాలు నిర్వహించాలని , సి.ఆర్.మీడియా అకాడమీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, యూనియన్ సంయుక్త ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో జర్నలిస్టులకు శిక్షణా తరగతులు నిర్వహించాలని యూనియన్ నిర్ణయించింది.
ఎపియుడబ్ల్యూజే ఏలూరు జిల్లా శాఖ ఆతిథ్యంలో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి అన్ని జిల్లాల నుంచి రాష్ట్రకార్యవర్గ సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు హాజరయ్యారు. ఐ.జే.యు.జాతీయ కౌన్సిల్ సభ్యులు జీ.వి.ఎస్.ఎన్.రాజు స్వాగతం పలుకగా, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కే.మాణిక్యరావు వందన సమర్పణ చేశారు.
ఉదయం “సామాజిక మాధ్యమాల యుగంలో మీడియా విశ్వసనీయత” అంశంపై జరిగిన సెమినార్ ను మీడియా అకాడమీ చైర్మన్ ప్రారంభించారు. రాష్ట్ర అధ్యక్షుడు ఐ వి సుబ్బారావు అధ్యక్షత వహించారు.
ఏలూరు రేంజ్ డి.ఐ.జి. ఆఫ్ పోలీసు శ్రీ జి.వి.జి. అశోక్ కుమార్, జిల్లా ఎస్పీ శ్రీ పి.ఎస్.కిషోర్, ఎమ్మెల్యే బడేటి రాధా కృష్ణయ్య, ఏలూరు మేయర్ నూర్జహాన్ బేగం, ఆర్టీసీ విజయవాడ జోన్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, విశాలాంధ్ర ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ కూన అజయ్ బాబు, ఐజేయు జాతీయ కార్యదర్శి డి.సోమసుందర్ మాట్లాడారు.
ఆగస్ట్ 5 న జర్నలిస్టుల డిమాండ్స్ డే
- Advertisement -
RELATED ARTICLES


