క్వార్ట్జ్ అక్రమ మైనింగ్, అక్రమ రవాణా, భారీ ఎత్తున పేలుడు పదార్థాల వినియోగం వ్యవహారంలో మాజీ మంత్రి, వైసీపీ నేత కాకాణి గోవర్ధన్ పై కేసు నమోదయింది. రూ. 250 కోట్లకు పైగా విలువ చేసే క్వార్ట్జ్, పల్సపర్ ను విదేశాలకు ఎగుమతి చేశారనే విషయంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో విచారణకు హాజరుకావాలంటూ పోలీసులు మూడుసార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ ఆయన హాజరుకాలేదు. కాకాణి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. ఆయన క్వాష్ పిటిషన్ ను రెండు వారాలకు వాయిదా వేసింది. ఆయన ఎక్కుడున్నారో ఆచూకీ తెలియడం లేదు. కాకాణితో పాటు మరో నలుగురు నిందితులు పరారీలోనే ఉన్నారు. వీరి కోసం హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలో ముమ్మరంగా గాలిస్తున్నారు. ఈ క్రమంలో కాకాణి దేశం విడిచి వెళ్లకుండా పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. అన్ని ఎయిర్ పోర్టులు, సీ పోర్టులకు సమాచారం అందించారు.