2019లో సాక్షి మీడియా తనపై రాసిన కథనంపై పరువునష్టం దావా వేసిన మంత్రి
2019లో సాక్షి మీడియా తనపై రాసిన కథనంపై వేసిన పరువునష్టం దావా కేసులో ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ఈరోజు విశాఖపట్నం కోర్టుకు హాజరయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తాను విశాఖ విమానాశ్రయానికి పలుమార్లు వచ్చానని, టీడీపీ ప్రభుత్వం తనపై లాంజ్‌లో రూ.25 లక్షలు ఖర్చుపెట్టిందని సాక్షి తన కథనంలో రాసిందని మంత్రి ఆరోపించారు. దీనిపై అప్పట్లోనే పరువునష్టం దావా వేశానన్నారు. ఆధారాలు లేకుండా ఇలాంటి వార్తలు ప్రచారం చేస్తే రీజాయిండర్ ఇవ్వాలని నోటీసులు జారీ చేశామని చెప్పారు. పదే పదే ఆధారాలు లేకుండా దుష్ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. ఇవాళ కూడా మంత్రి హోదాలో విశాఖకు వచ్చినా పార్టీ ఆఫీసులో బస్సులో నిద్రించినట్లు తెలిపారు. అక్కడ ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదన్నారు. వాటర్ బాటిల్స్, రవాణాకు వాహనాలు సైతం తన సొంత డబ్బు నుంచే ఖర్చుపెట్టుకున్నట్లు చెప్పారు. ఈ విషయం తన తల్లి భువనేశ్వరి నుంచి నేర్చుకున్నట్లు పేర్కొన్నారు. ఈ కేసు విచారణకు ఇప్పటికి నాలుగుసార్లు హాజరయ్యానని, ఇంకా ఎన్నిసార్లు పిలిచినా విచారణకు హాజరవుతానన్నారు. నిజం తనవైపు ఉందని, ఎప్పటికైనా అది గెలుస్తుందని నమ్ముతున్నట్లు లోకేశ్ చెప్పారు.
ఇక మంత్రిగా ఉండటం వల్ల రెగ్యూలర్ గా పాదయాత్రలు చేయలేమని, కానీ ప్రజా సమస్యల పరిష్కారం కోసం, వారిని కలిసేందుకు ప్రజా దర్బార్ నిర్వహిస్తుంటామన్నారు. ప్రజల నుంచి అర్జీలు తీసుకుని వారి సమస్యలు పరిష్కరిస్తున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వం అటు అభివృద్ధితో పాటు ఇటు సంక్షేమంపై ఫోకస్ చేసిందని మంత్రి చెప్పుకొచ్చారు.
ఇక గత ప్రభుత్వం రూ.3వేల కోట్ల బకాయిలు పెట్టిందని తెలిపారు. ఆ బకాయిలు వరుసగా తాము కట్టుకుంటూ వస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తనకు ఏ బాధ్యత అప్పగించినా అహర్నిశలు కష్టపడతానని అన్నారు. తనవల్ల పార్టీకి ఏనాడూ చెడ్డపేరు రాకుండా చూసుకుంటానని తెలిపారు.