విశాలాంధ్ర–రాప్తాడు : మండల పరిషత్ రాప్తాడు ప్రత్యేక అధికారిగా వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు ఎం. రవి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో బి. విజయలక్ష్మి, డిప్యూటీ ఎంపీడీవోలు అశోక్బాబు, అచ్యుత్బాబు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ భానురేఖ, కార్యాలయ సిబ్బంది ఎం. రవికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక అధికారి ఎం. రవి మాట్లాడుతూ, ప్రభుత్వం తనకు అప్పగించిన బాధ్యతలను నిబద్ధతతో నిర్వహిస్తానని తెలిపారు. మండల పరిషత్తు పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు సక్రమంగా జరిగేలా సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ పనిచేస్తామని చెప్పారు. ప్రజలకు అందాల్సిన ప్రభుత్వ సేవలు సకాలంలో అందేలా అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని అన్నారు. గ్రామాల్లో ప్రజలకు ఎదురయ్యే సమస్యలను నిబంధనల మేరకు పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. మండల పరిషత్ పరిధిలో చేపట్టే అభివృద్ధి పనుల్లో పారదర్శకత, నాణ్యతకు ప్రాధాన్యత ఇస్తామని ఎం. రవి పేర్కొన్నారు.


